సాక్షి, కొత్తగూడెం : అకాల వర్షం అన్నదాతలకు గుండె కోత మిగిల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లాలోని పంటలపై తీవ్రంగా పడింది. వారం రోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా 3.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 2.54 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ‘న్యూస్‌లైన్’ క్షేత్ర స్థాయిలో చేసిన పరిశీలన ప్రకారం జిల్లా వ్యాప్తంగా రూ. 310.72 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు అంచనా. దెబ్బతిన్న పంటలు చూసి మనోవేదనకు గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి.
జిల్లాలో ఈనెల 21 నుంచి కురిసిన వర్షాలతో పత్తి 2.54 లక్షల ఎకరాలు, వరి 28 వేలు, మిర్చి 15 వేలు, మొక్కజొన్న 21,775 ఎకరాలు, పొగాకు, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలు 18 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇందులో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో, మధిరలో 59 వేలు, పాలేరులో 30 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వరి నేలవాలడంతో పాటు పనలు పూర్తిగా నీట మునిగాయి. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు.
అశ్వారావుపేటలో వేరుశనగ, పొగాకు పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఈ ఆకాల వర్షం రైతులను నిండా ముంచినా జిల్లా యంత్రాంగం మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉంది. కాగా, గతంలో మాదిరిగానే 50 శాతం లోపే నష్టాన్ని చూపించి రైతులకు పరిహారం ఇవ్వకుండా చూసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడం బాధితులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఆగిపోతున్న రైతుల గుండెలు..
రూ. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు కళ్ల ముందే వర్షార్పాణం అవుతుంటే మనోవేదనకు గురైన రైతులు గుండెపోటుతో మరణిస్తున్నారు. సింగరేణి (కారేపల్లి) మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన గద్దికొప్పుల రామయ్య (40) పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే కొత్తగూడెం మండలం బేతంపూడిలో శనివారం పత్తి చేలో నీరు తొలగించేందుకు వెళ్లి నష్టపోయిన పంటను చూసి తేజావాత్ రాజు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన బొప్పిశెట్టి చెన్నారావు నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో శనివారం మృతి చెందారు. గతంలో జల్, లైలా, నీలం తుపాన్‌లతో రైతులు తీవ్రంగా నష్టపోయినా జిల్లా యంత్రాంగం కాకి లెక్కలు వేసిందని, 50 శాతం లోపు నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 3.38 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
Published Mon, Oct 28 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement