3 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు
శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు. ఇచ్ఛాపురం అసెం బ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ ఏకైక సమన్వయకర్తగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియమితులయ్యారు. అదే విధంగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా రెడ్డి శాంతిని నియమించారు.
ఇక ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నర్తు నరేంద్రయాదవ్ నియ మితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిద్దరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ధర్మాన ప్రసాదరావు జిల్లాలో 30 ఏళ్లుగా కీలక రాజకీయ నేతగా ఉన్నారు. 1989, 1999 ఎన్నికల్లో నరసన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన రెడ్డి శాంతి కూడా జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారే. ఆమె సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం కుమార్తె. రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఈమె ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఇచ్ఛాపురం ఏకైక సమన్వయకర్తగా నియమితులైన నర్తు నరేంద్ర ఇటీవలి వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ధర్మా న ప్రసాదరావు, రెడ్డి శాంతి, నర్తు నరేంద్రల నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.