సుంకులమ్మ తిరునాళ్లలో ఘోర ప్రమాదం
* బండిశిల రథంపై తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు
* ముగ్గురు మృతి
* 10 మందికి తీవ్రగాయాలు
* 30 మందికి స్వల్ప గాయాలు
* అనంతపురం జిల్లాలో ఘోరం
గుత్తి/పామిడి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లాలో జరుగుతున్న సుంకులమ్మ బండిశిల తిరునాళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. బండిశిల రథాన్ని ఊరేగింపుగా తీసుకొస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మూడు ఎద్దులు కూడా చనిపోయాయి. పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాశేపల్లి, గుత్తి అనంతపురం, పామిడి మండలం రామరాజుపల్లి గ్రామస్తుల సమక్షంలో సుంకులమ్మ బండిశిల తిరునాళ్ల ఈ నెల ఏడో తేదీన ప్రారంభమయ్యాయి. శుక్రవారం రామరాజుపల్లి నుంచి గుత్తి అనంతపురం గ్రామ శివారులోని సుంకులమ్మ ఆలయం వద్దకు బండి శిల రథాన్ని ఏడు జతల ఎద్దులతో తీసుకెళుతున్నారు.
రాత్రి 8.20 గంటలకు కాశేపల్లి వద్దకు రాగానే రథం అదుపుతప్పి పక్కకు వెళ్లిపోయింది. దీంతో పైనున్న 220 కేవీ విద్యుత్ లైన్లకు రథం తగిలి అవి తెగి ఎద్దులపైన, పక్కనే వస్తు న్న జనంపైన పడ్డాయి. జనం భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. విద్యుదాఘాతంతో కాశేపల్లికి చెందిన ముత్యాలరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామాంజులరెడ్డి (30), సుధీర్, మాణిక్యాచారి (20), పవన్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ (50), లక్ష్మిరెడ్డి, బాబురెడ్డి, శ్రీరామరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిని 108లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. రామాం జులరెడ్డి మార్గం మధ్యలోనే మరణించాడు. లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో మృతిచెందారు. మిగతా 10 మందికి 70 శాతం మేర శరీరం కాలిపోయింది. వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. స్వల్పంగా గాయపడిన 30 మందిని గుత్తి, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. విద్యుదాఘాతానికి గురైన బండిశిల రథం కాలిపోయింది. విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో గ్రామంలో అంధకారం అలుముకుంది.
ఇదీ బండిశిల రథం..
తిరునాళ్లలో భాగంగా పొడవాటి దుంగను అలంకరించి ఒక ఎద్దుల బండిపై పీఠం తయారు చేసి నిల్చోబెడతారు. దీనినే బండిశిల రథమంటారు. దుంగ పైభాగంలో ఎర్రటి వస్త్రం, ఒక గంట ఉంటాయి. ఈ బండిని ఏడు జతల ఎద్దులు లాగుతాయి. తిరునాళ్లు జరిగే రోజుల్లో ఈ రథం పలు గ్రామాల్లో సంచరిస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రామరాజుపల్లికి చేరుకుంది. సాయంత్రం కాశేపల్లికి బయల్దేరింది. కాశేపల్లి నుంచి రాత్రికి గుత్తి అనంతపురం గ్రామం చేరుకోవాల్సి ఉంది. ఆదివారం నాటికి తిరిగి రామరాజుపల్లికి చేరుకోవడంతో తిరునాళ్లు ముగుస్తాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కాశేపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లను రథం పైభాగం తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.