
వైసీపీలోకి భారీ చేరికలు.. కొత్తపల్లి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బరాయుడు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కారంపూడిలో గురువారం వారు సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలన్న తమ అభిమతాన్ని జగన్కు తెలియజేయగా, ఆయన సుముఖత వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం మాచర్లలో జరగనున్న వైఎస్ఆర్ జనభేరిలో జగన్ సమక్షంలో సురేష్ పార్టీలో చేరనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇదివరకే రాజీనామా చేశారు. సుబ్బరాయుడు నరసాపురం ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు ఎంపికయ్యారు. ఇక కారుమూరి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఇప్పటికే ఈ జిల్లాల్లో బలోపేతంగా ఉన్న వైసీపీ తాజా చేరికలతో మరింత బలం చేకూరినట్టయ్యింది. క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.