328 ఒప్పందాలు
విలువ రూ.4.67 లక్షల కోట్లు: సీఎం చంద్రబాబు ప్రకటన
(విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సు మంగళవారం ముగిసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ మూడురోజుల సదస్సులో మొత్తం 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, తద్వారా రూ.4.67 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. చివర్లో మరికొందరు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ విలువను దీన్లో చేర్చలేదని అన్నారు. ‘భారత్ సహా 41 దేశాల నుంచి 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు 32 ఎంఓయూలు కుదరగా... 2వ రోజు 248, మూడోరోజు 48 ఒప్పందాలు జరిగాయి.
దాదాపు ప్రతి రంగంలోనూ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. తయారీ రంగానికి సంబంధించి సుభాష్ చంద్ర సారథ్యంలోని ఎస్సెల్ గ్రూప్, అనిల్ అంబానీకి చెందిన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్, అమరరాజా, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫార్మాలో దివీస్ ల్యాబొరేటరీస్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ వంటి దిగ్గజాలు ముందుకొచ్చాయి. విద్యుత్ రంగంలో ట్రైనా సోలార్, సుజ్లాన్ వంటివి ఎంఓయూ చేసుకున్నాయి’ అని వివరించారు.
రిటైల్ సహా మైనింగ్‌లోనూ దిగ్గజాలు
రిటైల్ రంగంలో వాల్‌మార్ట్, ఫ్యూచర్ గ్రూప్, అరవింద్ రిటైల్, స్పెన్సర్స్ వంటి పెద్ద కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. మైనింగ్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్, సంఘీ సిమెంట్స్, మై హోమ్ గ్రూప్ ముందుకొచ్చాయని, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయని చెప్పారు. నగరాల అభివృద్ధికి సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. సదస్సుకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని, వచ్చే 30 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుకెళుతుందని పేర్కొన్నారు. ఎగుమతులకు అవసరమైన వస్తువుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారుతుందని, ముఖ్యంగా హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, సోలార్ రంగాలకు విపరీతమైన అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. గత రెండురోజుల్లో 44 ద్వైపాక్షిక సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సదస్సు నిర్వహించేందుకు సీఐఐ అంగీకరించిందని వెల్లడించారు.
ఎస్సెల్ ఇన్‌ఫ్రా భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎక్విప్‌మెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జీ-టీవీ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఇందుకోసం చైనాకు చెందిన గోల్డెన్ కంకార్డ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (జీసీఎల్)తో కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13,000 కోట్లు) పెట్టుబడి పెడతామని, 15వేల ఉద్యోగాలొస్తాయని ఎస్సెల్ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్ర మంగళవారం నాడిక్కడ చెప్పారు. ఈ యూనిట్‌కు దాదాపు 2వేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుందన్నారు.
సోలార్ పరికరాల తయారీతో పాటు భారత, చైనా కంపెనీలు వివిధ సంస్థల్ని ఏర్పాటు చేయటం కోసం స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్కును కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58,500 కోట్లు) పెట్టుబడి అవసరమవుతుందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మం గళవారం సీఎం చంద్రబాబునాయుడి సమక్షంలో ఆయన ఎంవోయూపై సంతకాలు చేశా రు. ఈ సందర్భంగా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ‘మేం ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నది మీడియాతో సహా సేవల రంగంలోనే.
ప్రధానమంత్రి మేకిన్ ఇండియా పిలుపు మేరకు విదేశీ భాగస్వాములతో కలసి ఏదైనా ఏర్పాటు చేయాలని వివిధ దేశాలకు వెళ్లా. ఎన్ని తిరిగినా తయారీలో చైనాను మించిన దేశం కనిపించలేదు. అందుకే చైనా కంపెనీతో జట్టుకట్టా. ఇండియాలో చూసినపుడు వ్యాపారం చేయటానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపించింది. అందుకే ఇక్కడ పెట్టుబడికి సిద్ధమయ్యా’ అని వివరించారు. మేకిన్ ఇండియాలో తామూ భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని జీసీఎల్ వైస్ చైర్మన్ షు హువా చెప్పారు. తాము పెట్టుబడులతో పాటు ఫొటో వోల్టాయిక్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని కూడా ఇండియాకు తీసుకొస్తామని తెలిపారు. ఈ ఎక్విప్‌మెంట్ తయారీ కేంద్రాన్ని, స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా ఖరారు కాలేద ని, దీనిపైనే చర్చలు జరుపుతున్నామని చెప్పారు.