నెల్లూరు: వేగంగా వెళ్తున్న బస్సు లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెన్నాబ్రిడ్జి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. 22మంది ప్రయాణికులతో చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న మూన్ లైట్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు పెన్నాబ్రిడ్జి సమీపంలోకి రాగానే లారీని ఓవర్ టేక్ చేయగా మరో లారీ అడ్డు ఉండటంతో దాన్ని తప్పించబోయింది.
దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సింహపురి ఆస్పత్రికి తరలించారు.