షార్క్.. అచ్చతెలుగులో చెప్పాలంటే సొరచేప! మత్స్యరాశులకు రాజులాంటిది! రూపం, లక్షణాల రీత్యా వివిధ
అత్యంత ప్రమాదకర స్థితిలో 60 రకాలు
కాలుష్య కాసారంగా సముద్ర తీరం
అవగాహనలేక వేటాడుతున్న మత్స్యకారులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: షార్క్.. అచ్చతెలుగులో చెప్పాలంటే సొరచేప! మత్స్యరాశులకు రాజులాంటిది! రూపం, లక్షణాల రీత్యా వివిధ జాతులుగా ఉన్నా మత్స్యకారులకు వలలకు చిక్కాయంటే వారికి పండుగే! గత కొన్నేళ్లుగా అవి వలలకు చిక్కడం లేదు. మత్స్యకారుల్లో ఆ సందడికనిపించడం లేదు. జిల్లాలో ఉప్పాడ నుంచి అంతర్వేది వరకూ ఉన్న నదీముఖద్వార సముద్రతీర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా దొరికే సొరచేపలు ఇప్పుడు అంతరించిపోతున్న మత్స్యజాతుల్లోకి చేరిపోయాయి. కారణం ఎవరూ అంటే.. ‘వేరెవరో కాదు.. కచ్చితంగా మనమే’ అని సమాధానం వస్తోంది పర్యావరణవేత్తల నుంచి!
ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన జలచర జాతులు దాదాపు 1,700 వరకూ ఉంటే వాటిలో 93 జాతులు ప్రమాదకరస్థాయిలో అంతరించిపోతున్న (క్రిటికల్లీ ఎన్‌డేంజ ర్డ్) జాబితాలో చేరిపోయాయి. వాటిలో 60 రకాల చేపలు మన జిల్లా తీరంలో సందడి చేసినవే. పొడవైన ముక్కుతో చూపరులను భయపెట్టే చిన్నరంపపు సొర (స్మాల్‌టూత్ సాఫిష్), రంపపు సొర (లాంగ్‌కాంబ్ సాఫిష్) గత పదిహేనేళ్లుగా అసలు కనిపించడం లేదు. అలాగే ఒకప్పుడు మాంసాహార ప్రియుల ఇళ్లలో కనీసం వారానికి ఒకసారైనా నోరూరించిన పాలసొర (పాండిచ్చేరి షార్క్) గత ఏడేళ్లుగా కానరావడం లేదు.
ఇది కూడా ప్రమాదకరస్థాయిలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరిపోయింది. అలాగే సముద్ర బొచ్చు అని పిలిచే విదేశీ చేప ఎర్ర వెంపలి (విక్టోరియా తిలాపియా) జాడ కూడా కొద్దిరోజులుగా కరువైంది. జిల్లా సముద్రతీరంలో ఎక్కువగా దొరికే యాల-రంపపు సొర (నైఫ్‌టూత్ సాఫిష్), పంజు (స్లిప్పెరే సిలూరాయిడ్), సుత్తితల చేప (స్కాల్లోపెడ్ హేమర్‌హెడ్), కొమ్ము సొర (గ్రేట్ హేమర్‌హెడ్) అంతరించిపోతున్న మత్స్యజాతుల జాబితాలో ఉన్నాయి. ఇటీవల ఇవి సముద్రంలోనే చనిపోతుండగా కళేబరాలు తరచుగా తీరానికి కొట్టుకొస్తున్నాయి.
మరి కొన్నింటిపైనా మృత్యుఛాయ
మత్స్యకారుల వలలో తరచుగా చిక్కుకునే జాతుల్లో గున్న సొర (వేల్ షార్క్) ఒకటి. శరీరం నిండా చక్కని చుక్కలతో ఆకర్షించే ఇది కొన్ని రోజులకు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. జీబ్రా సొరది కూడా అదే పరిస్థితి. అలాగే హనుమంతు సొర, లెమన్ షార్క్, కొమ్ము సొర, తిరగల దిండి (బోమౌత్ గుయిటర్ ఫిష్), ఉలవ, టిప్పు ఉలవ తదితర రకాల చేపలకు ప్రమాదం పొంచి ఉంది. మన తీరంలో ఎక్కువగా కనిపించే టేకి చేపలదీ అదే పరిస్థితి. టేకి, పులిటేకి, తప్పుకూటి, మూకర టేకి, దెయ్యపు టేకి తదితర జాతులకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది ఆహారంగా తీసుకునే ఎర్రమోసు, చైనా బొచ్చు, మూర (బిగ్‌ఐ టూనా) చేపలు కూడా కొన్ని రోజులకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అవగాహన లేమే అసలు సమస్య
1980 దశకంలో మెకనైజ్డ్ (మర) బోట్లతో చేపల వేట మొదలైన తర్వాత మత్స్యసంపద క్రమేపీ తగ్గిపోవడం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు రెండున్నర మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం కన్నులు ఉన్న వలలను.. అదీ రెండు పొరలున్నవి వాడుతుండటం మరీ ఎక్కువైంది. దీంతో సముద్రగర్భంలో దొరికే మత్స్యజాతులన్నింటినీ ఒడ్డుకు చేర్చేస్తున్నారు. తినే చేపలను అమ్ముకొని, మిగతా (దాదాపు 60 శాతం) వాటిని కోళ్ల మేత (ఫీడ్) తయారుచేసే పరిశ్రమలకు తరలిస్తున్నారు. వాటిలో చేపలే కాదు వాటి గుడ్లు కూడా పోతున్నాయి. సహజంగా సొరచేపలు, టేకి జాతి చేపలు రెండు మూడేళ్లకు ఒకసారే గుడ్లు పెడతాయి. అదీ ఆగస్టు నుంచి నవంబరు వరకూ సీజన్‌లోనే. వాటిలో అధికభాగం వలలకు చిక్కుతుండటంతో ఆయా మత్స్యజాతుల ఉనికే ప్రమాదంలో పడుతోంది. మరబోట్లు, వలల వినియోగం, సముద్రంలో ఎంతమేర వేట సాగించాలనే విషయాలపై ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని అమలు చేసే అధికారులు కానీ, వాటి గురించి మత్స్యకారుల్లో అవగాహన కల్పించే యంత్రాంగం కానీ లేకపోవడం పెద్ద లోటు.
కాలుష్యమూ సమస్యే..
జిల్లాలో ఒక్క కాకినాడ నుంచే సగటున రోజుకు 37 లక్షల లీటర్ల మురుగునీరు సముద్రంలో కలుస్తోంది. చివరకు పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారు. తప్పనిసరి అవసరమే అయినా గోదావరి బేసిన్‌లో చమురు, సహజవాయువు వెలికితీత కార్యక్రమాల ప్రభావం కూడా మత్స్యసంపదపై పడుతోంది.