
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయా సంవత్సరాంత పరీక్షలను రద్దు చేసి, ఆ విద్యార్థులంతా పాస్ (ఉత్తీర్ణులు) అయినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షల వాయిదా తదితర నిర్ణయాలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ దృష్ట్యా స్కూళ్లు మూతపడినందున నేరుగా విద్యార్థుల ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, చిక్కీ, గుడ్ల పంపిణీని సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. అన్ని చోట్లా ఒకే నాణ్యత ఉండాలని, గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం వలంటీర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
31న సమీక్ష తర్వాత పది పరీక్షల షెడ్యూల్: మంత్రి సురేష్
►ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదు. అందుకే సీఎం ఆదేశాల మేరకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు అవకాశం కల్పిస్తున్నాం. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ మెమో 92 విడుదల చేసింది.
►పదో తరగతి పరీక్షలను ఇప్పటికే వాయిదా వేశాం. ఈ నెల 31న జరిగే సమీక్ష తరువాత పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తాం.
►దీనిపై విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దు.
►విద్యార్థుల ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులను అందించాలని నిర్ణయించాం. వలంటీర్ల ద్వారా పంపిణీ సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment