సమగ్ర వ్యూహం | YS Jagan Mohan Reddy Speaks About Coronavirus In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సమగ్ర వ్యూహం

Published Fri, Apr 3 2020 4:36 AM | Last Updated on Fri, Apr 3 2020 12:36 PM

YS Jagan Mohan Reddy Speaks About Coronavirus In Andhra Pradesh - Sakshi

ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో కోవిడ్‌–19ను సమగ్ర వ్యూహంతో ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. వైద్య పరంగా ఇప్పుడున్న యంత్రాంగాన్ని, పరికరాలను పూర్తి స్థాయిలో మోహరిస్తున్నామని చెప్పారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం ఢిల్లీ నుంచి ప్రధాని  మోదీ.. హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణలో భాగంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదలు, రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వైఎస్‌ జగన్‌ వారికి వివరించారు. సీఎం ప్రధానికి వివరించిన అంశాలు ఇలా..

ప్రత్యేక ఆసుపత్రులతో అన్ని విధాలా సిద్ధం 
♦  విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2,012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను నెలకొల్పాం. 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌ –19 వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించాం. వీటిల్లో 10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ సిద్ధం చేశాం. మొత్తంగా 1,000 ఐసీయూ బెడ్లను సిద్ధం చేశాం. వీటికి తోడు ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం మరో 20 వేల బెడ్లను సిద్ధంగా ఉంచాం.  
♦  క్షేత్ర స్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నాం. ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటి వరకు 27,876 మందికిపైగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 17,336 మంది ఉన్నారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు.. మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారు. వీరందరూ పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు.  
♦  కోవిడ్‌–19 లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేశాం. గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు మార్లు సర్వే చేశాం. ఢిల్లీ సదస్సుకు హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాం. వారితో కాంటాక్టులో ఉన్న వారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.  
♦  మరిన్ని పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మరింత అవసరం ఉంది.

ఆదాయం గణనీయంగా తగ్గడంతో పాటు కోవిడ్‌ –19 నివారణ చర్యల కోసం అనుకోకుండా ఖర్చులు బాగా పెరిగాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో ఇవ్వాల్సిన జీతాల్లో 50 శాతం వాయిదా వేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆదుకోవాలి.

ఢిల్లీ సదస్సు కేసులే ఎక్కువ
♦  ఢిల్లీలో తబ్లిగి జమాత్‌ సదస్సుకు హాజరైన 1085 మందిని గుర్తించాం. ఇందులో 977 మంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారు. మిగతా వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు.  
♦  ప్రస్తుతం గుర్తించిన వారిలో 750 మందికి పరీక్షలు నిర్వహించగా 91 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరికి సన్నిహితంగా ఉన్న వారు, కుటుంబ సభ్యులు.. 544 మందికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌ వచ్చింది. మొత్తంగా 111 మందికి పాజిటివ్‌. మిగతా వారందరినీ క్వారంటైన్‌లో ఉంచాం.  
♦  ఢిల్లీ సదస్సుకు సంబంధించిన కేసుల్లో మిగిలిన 227 మందిని, వారికి సన్నిహితంగా మెలిగిన వారు, కుటుంబ సభ్యులను పరీక్షిస్తే రాష్ట్రంలో ఒక స్పష్టత వస్తుంది. ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేశాం.  
♦  రాష్ట్రంలో ఇప్పటిదాకా 132 పాజిటివ్‌ కేసుల్లో ఢిల్లీ సదస్సు కేసులు 111 పోగా, మిగిలిన 21 పాజిటివ్‌ కేసుల (విదేశాల నుంచి వచ్చిన వారు, వారికి సన్నిహితంగా ఉన్న వారు) విషయంలో సమగ్ర సర్వే చేపట్టాం. వీరి విషయంలో పెరుగుదల అంతంత మాత్రమే. రోజుకు రెండు మూడు కేసులు పెరుగుతున్నాయి. (ఉదయం సమాచారం మేరకు వివరించిన వివరాలివి..)
♦  ఇతరత్రా కేసులు పెరగకుండా క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీ ద్వారా పూర్తి స్థాయిలో దృష్టి సారించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం.
♦  రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9,695 మంది కోసం 218 సహాయ పునరావాస శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఇందులో ఏపీకి చెందిన వారు 3,819 మంది, ఇతర రాష్ట్రాల వారు 5,876 మంది ఉన్నారు.
♦  రైతు బజార్లను వికేంద్రీకరించాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రత్యేక కమిటీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ప్రతి మార్కెట్, దుకాణాల వద్ద ధరల పట్టికను ప్రదర్శిస్తున్నాం.

♦విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో 2,012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో కోవిడ్‌ ఆస్పత్రులు నెలకొల్పాం

♦80,896 మందిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.. 1,000 ఐసీయూ బెడ్లు, 10,933 నాన్‌ ఐసీయూ బెడ్లు సిద్ధం చేశాం

వలంటీర్లతో సర్వే
కోవిడ్‌–19 లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేశాం. గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు మార్లు సర్వే చేశాం. ఢిల్లీ సదస్సుకు హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాం. వారితో కాంటాక్టులో ఉన్న వారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.

ఇబ్బందులున్నా.. సంక్షేమం
లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని పేద కుటుంబాలను ఆదుకోవడానికి పలు రకాల చర్యలు తీసుకున్నాం. ఏప్రిల్‌ నెలకు ఇవ్వాల్సిన రేషన్‌ను మార్చి 29 నుంచే ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. కేజీ కంది పప్పును ఉచితంగా ఇచ్చాం. ఒకే నెలలో మొత్తం 3 సార్లు రేషన్, కందిపప్పును ఉచితంగా అందిస్తున్నాం. నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రతి పేద కుటుంబానికి రూ.1,000 ఈ నెల 4వ తేదీన ఇవ్వబోతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement