రెండు నెలల ఉద్యమాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా టీనోట్‌ను ఆమోదించడం పట్ల జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. గురువారం ఉదయం నుంచే టీనోట్ కేబినెట్ ముందుకు రాబోతుందన్న విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమైక్యవాదులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. కర్నూలులో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆత్మకూరులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇళ్లను ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేబినెట్ టీనోట్‌కు ఆమోదముద్ర వేసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా అన్ని జేఏసీల ప్రతినిధులు ఉద్యమ తీవ్రతకు నిర్ణయించాయి. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి.
విభజనపై మొదటి నుంచి ఉద్యమిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ బంద్ చేపడుతున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి నేతృత్వంలో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్, టీడీపీ దీక్షా శిబిరాలను సమైక్యవాదులు తొలగించేశారు. డోన్‌లో రైల్వే పట్టాలపై టైర్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వెల్దుర్తి వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. కర్నూలు కలెక్టరేట్ కూడలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి టైర్లకు నిప్పు పెట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తును పటిష్టం చేశారు.
- సాక్షి ప్రతినిధి, కర్నూలు