హైదరాబాద్: ఏపీలో మంగళవారం నిర్వహించిన డీఈఈ సెట్ (డీసెట్)- 2016 కు తొలిరోజు 86 శాతం మంది హాజరయ్యారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించిన డీసెట్ స్వల్ప అవాంతరాలు మినహా దాదాపుగా అన్ని కేంద్రాల్లోనూ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 57 ప్రత్యేక పరీక్ష కేంద్రాల్లో ఈ ఆన్‌లైన్ పరీక్ష జరిగినట్లు డీసెట్ కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు గురువారం వరకు జరగనున్నాయి. ప్రతి రోజూ రెండు విడతలుగా బ్యాచ్‌ల వారీగా ఈ ప్రవేశ పరీక్ష జరుగుతోంది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తొలివిడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పరీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం మొదటి విడత పరీక్షకు 14,145 మందికి గాను 11,924 మంది హాజరయ్యారు. రెండో విడతలో 14,110 మందికి గాను 12,134 మంది ఆన్‌లైన్ పరీక్ష రాశారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా డీసెట్‌ను నిర్వహిస్తుండడంతో సదరు వెబ్‌సైట్లో గత వారం రోజులుగా మాక్ టెస్టుకు అవకావం కల్పించారు.
తప్పుల కోసం ఫిర్యాదు బాక్స్
డీసెట్‌కు హాజరయ్యే అభ్యర్ధులు పుట్టిన తేదీ, తండ్రి, తల్లి పేరు, కులము, మతము తదితర సమాచారం తప్పులుగా నమోదై ఉంటే సరిచేసుకొనేందుకు వెబ్‌సైట్‌లోనే కంప్లయింట్ బాక్సును ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ తెలిపారు. వివరాలు సరిచేసుకొనేందుకు ‘డీఈఈసెట్‌ఏపీ.సీజీజీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్లో పొందుపర్చినట్లు వివరించారు. ఈ ఫిర్యాదు బాక్సు ఈ నెల 18 నుంచి 23 వ తేదీ వరకు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుందన్నారు.