ఒక్క 'యాప్‌' 89 పోలీస్‌ సేవలు  | 89 Police Services with One App | Sakshi
Sakshi News home page

ఒక్క 'యాప్‌' 89 పోలీస్‌ సేవలు 

Published Sun, Dec 8 2019 4:22 AM | Last Updated on Sun, Dec 8 2019 4:29 AM

89 Police Services with One App - Sakshi

ఒకే ఒక్క యాప్‌తో 89 సేవలు... మీ ఫోన్‌లో ‘స్పందన సురక్ష’ ఉంటే చాలు..! ఇప్పుడన్నీ యాప్‌లే.. తినడానికైనా, కొనడానికైనా! పోలీస్‌శాఖ కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీస్‌ స్టేషన్లు, మీ–సేవా కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా, చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు కూర్చున్న చోటు నుంచే పోలీసు సేవలు పొందే యాప్‌ సిద్ధమైంది. దీని ద్వారా 15 ప్రధాన విభాగాల్లో పలు రకాల సేవలను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఈ యాప్‌ సేవలను ప్రారంభించేందుకు పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది.      
– సాక్షి, అమరావతి

‘స్పందన సురక్ష’తో అందే ప్రధాన సేవలు
–    అత్యవసర సమయాల్లో పోలీసు శాఖ పరిధిలోని డయల్‌ 112, ఈ మెయిల్స్, వెబ్‌ సెర్చింగ్, ఎస్‌ఎంఎస్‌ లాంటి అన్ని కీలక లింక్‌లు ఈ యాప్‌తో అనుసంధానమై  ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి ఉపయోగించినా అత్యవసర సిగ్నల్‌ ద్వారా పోలీసులను అప్రమత్తం చేస్తుంది. 
–    ఈ యాప్‌ ద్వారా ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారి(ఎస్‌హెచ్‌వో)కి అందిన ఫిర్యాదు రశీదు కూడా యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవడంతోపాటు ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకోవచ్చు. 
–    ఈ యాప్‌తో పౌర (కమ్యూనిటీ) పోలీసింగ్‌ నిర్వహించవచ్చు. అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక శక్తుల ఆగడాలను ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తేవచ్చు.  
–    సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌), ప్రత్యేక పోలీస్‌ బీట్‌ ద్వారా రక్షణ కల్పిస్తారు.  
–    ఈ చలానా ద్వారా వాహనాలకు విధించే అపరాధ రుసుము, ఎప్పుడు ఫైన్‌ పడింది? ఎంత చెల్లించాలి? తదితర వివరాలను యాప్‌ ద్వారా తెలుసుకుని చెల్లింపులు జరపవచ్చు. 
–    సొత్తు రికవరీ ఆప్షన్‌లో చోరీకి గురైన నగదు, బంగారం, వాహనాలు, మొబైల్‌ ఫోన్‌లు తదితరాలకు సంబంధించి పోలీస్‌ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 
–    కేసు స్టేటస్‌ ఆప్షన్‌లో జిల్లా, మండలం, పోలీస్‌ స్టేషన్, ఎఫ్‌ఐఆర్‌ వారీగా వివరాలను స్వయంగా చూసుకోవచ్చు. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పౌరులు స్వయంగా చూడవచ్చు. ఫిర్యాదు రశీదు, ఎఫ్‌ఐఆర్‌ పత్రాలను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
–    సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. లొకేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆప్షన్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, సబ్‌ డివిజనల్‌ ఆఫీస్‌లు(ఎస్‌డీపీఓ), జిల్లా ఎస్పీ కార్యాలయాలు, అధికారుల మొబైల్, ల్యాండ్‌ ఫోన్‌ నెంబర్లతో సహా తెలుసుకోవచ్చు.  
–    పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆప్షన్‌ ఈ యాప్‌ ఉన్న పౌరుడు ఏ ప్రాంతానికి వెళ్లినా సమీపంలోని పోలీస్‌ స్టేషన్, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, ఎక్కువ నేరాలు జరిగే ప్రదేశాలు, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమాచారాన్ని చూపిస్తుంది. చట్టాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే వెబ్‌సైట్‌ లింక్‌లు కూడా ఉంటాయి. 
–    అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్ల వివరాలు కూడా ఈ యాప్‌లో ఉంటాయి. పోలీస్‌ సేవల కోసం డయల్‌ 100, అత్యవసర సేవలకు 112, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, టూరిస్ట్‌ హెల్ప్‌లైన్‌ 1363, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, అంబులెన్స్‌ సేవలకు 108, ఫైర్‌ సర్వీస్‌కు 101, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర సేవలకు 1073, సైబర్‌ మిత్ర సేవల కోసం 9121211100కి డయల్‌ చేయవచ్చు. 
ఏపీ పోలీసు శాఖ రూపొందించిన యాప్‌లో అందించే సేవలు 

యాప్‌ ద్వారా లభించే మరికొన్ని సేవలు
- కేసు పురోగతి వివరాలు 
- కిడ్నాప్‌నకు గురైన వ్యక్తుల గాలింపు వివరాలు 
- గుర్తు తెలియని మృతదేహాల వివరాలు 
- అరెస్టు అయిన నిందితుల వివరాలు 
- పాస్‌పోర్ట్‌ తనిఖీ స్టేటస్‌ ఉన్న చోటు నుంచే పోలీస్‌ సేవలు  
మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ యాప్‌ను రూపొందించాం. పోలీసుశాఖ టెక్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను తెస్తున్నాం. ఇప్పటికే దాదాపు 60 సేవలను మీ–సేవ ద్వారా పౌరులకు అందిస్తున్నాం. వీటికి మరిన్ని సేవలు జోడించి ‘స్పందన సురక్ష’ యాప్‌ తెస్తున్నాం. 89 రకాల పోలీసు సేవలను మొబైల్‌ ఫోన్‌ ద్వారా పౌరులు తాము ఉన్న చోటు నుంచే పొందవచ్చు.
    – గౌతమ్‌ సవాంగ్, డీజీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement