చీరాలలో రోజు రోజుకూ దొంగలు బరితెగిస్తున్నారు. ఇళ్లల్లో చొరబడి అందినకాడికి దోచుకుంటున్నారు.
= చీరాలలో ఆర్‌అండ్‌బీ డీఈ ఇల్లు లూటీ
= 250 గ్రాముల బంగారం అపహరణ
= రూ.15 వేల నగదు కూడా..
చీరాల రూరల్ : చీరాలలో రోజు రోజుకూ దొంగలు బరితెగిస్తున్నారు. ఇళ్లల్లో చొరబడి అందినకాడికి దోచుకుంటున్నారు. సహజంగా రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే దొంగలు ప్రస్తుతం తమ పంథా మార్చుకుని పగటి వేళల్లో కూడా ఇళ్లు లూటీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలతో పాటు నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన మేరుగ శ్రీనివాసరావు ఆర్‌అండ్‌బీ డీఈగా చీరాలలో విధులు నిర్వర్తిస్తుంటారు. రోజూ మాదిరిగా ఉదయాన్నే ఆయన ఆఫీసుకు వెళ్లారు. అతని భార్య భారతి కంప్యూటర్ నేర్చుకునేందుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి ఒంటి గంటకు వచ్చింది.
వంటగది తలుపులు బార్లా తెరచి ఉండటంతో అనుమానం వచ్చి బెడ్‌రూమ్‌లోని బీరువాలను పరిశీలించింది. రెండు బీరువాల్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారణకు వచ్చింది. బీరువాలో దాచుకున్న నాలుగు బంగారు గాజులు, రెండు హారాలు, రెండు చైనులు, చెవి కమ్మ (సుమారు) మొత్తం 250 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. అంతేకాకుండా ఇంటి అవసరాలకు దాచుకున్న రూ.15 వేలు మాయమైనట్లు గుర్తించింది. తొలుత తన భర్త శ్రీనివాసరావుకు సమాచారం అందించి అనంతరం టూటౌన్ పోలీసులకు భారతి ఫిర్యాదు చేసింది.
డీఎస్పీ జయరామరాజు, సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ వచ్చి బైపాస్ వైపు పరుగులు తీసింది. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ డాక్టర్ ఇంట్లో దొంగలు పడి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో మళ్లీ మరో భారీ చోరీ జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కాలనీపై రాత్రి వేళల్లో నిఘా ఉంచాలని కోరుతున్నారు.