శాసనసభలో ప్రజాస్వామ్యం ఖూనీ | A parliamentary democracy assassition | Sakshi
Sakshi News home page

శాసనసభలో ప్రజాస్వామ్యం ఖూనీ

Mar 21 2015 2:06 AM | Updated on Aug 16 2018 4:12 PM

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్‌బాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ దేశచరిత్రలో ఎక్కడా జరగని రీతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ప్రతిపక్షానికి రక్షణగా, హుందాగా వ్యవహరించాల్సిన సభాపతి టీడీపీ సభ్యుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మాట్లాడుతుంటే అధికార పక్షం నుంచి నిరసన రాకపోయినా మైక్ కట్ చేయడం ప్రతిపక్షనేతను అవమానించడమేనన్నారు.

67 మంది సభ్యులు కలిగిన బలమైన ప్రతిపక్షం నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే పరిస్థితి వచ్చిందంటే పాలకపక్షం, స్పీకర్ వైఖరే కారణమన్నారు. ప్రజల సమస్యలుగానీ, రైతులు, మహిళల రుణాల మాఫీ అంశంగానీ ప్రస్తావించే అవకాశం కూడా లేకుండా చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్షం గొంతునొక్కడమంటే ప్రజల గొంతునొక్కడమేనన్నారు. టీడీపీ సభ్యులు వీధిరౌడీల్లా, గూండాల్లాగా వ్యవహరించి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం సిగ్గుచేటన్నారు.

ఇది సభను కించపరచమే అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీలలో జరుగుతున్న విపరీతపోకడలను ఇప్పటి వరకూ మనం చూశామని, ఇప్పుడు టీడీపీ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అలాంటి దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు తెలుగు ప్రజలను తలదించుకొనేలా చేశాయన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించడం లేదని, అన్ని పక్షాలను సమానంగా చూడటం లేదని విమర్శించారు.
 
వ్యక్తిగత దూషణలకే అధిక సమయం వృథా...
ప్రతిపక్షనేత అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగి సమస్యను పక్కదారి పట్టించడం అధికారపక్షానికి ఆనవాయితీగా మారిందని నగర మేయర్ కె. సురేష్‌బాబు విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్కూల్‌లో చదివితే వీరికెందుకండీ...బడ్జెట్‌పై చర్చ సాగుతున్నప్పుడు సంబంధం లేని విషయాలను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్  మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ప్రతిసారి మైక్ కట్ చేసి మంత్రులకు, టీడీపీ సభ్యులకు మైకులిస్తున్నారన్నారు.  

ఒక ఫ్యాక్షనిస్టును స్పీకర్‌ను చేస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్షనేతకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలియాలంటే ప్రతిపక్షనేతకు అధిక సమయం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నారు మాధవ్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement