
వృద్ధుల పోషణ చట్టం అమలుకు హైకోర్టులో పిల్
హైదరాబాద్: వృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ చట్టం కింద వృద్ధుల, తల్లిదండ్రుల సంక్షేమం, వారి పోషణకు సంబంధించి కేసులను విచారించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా, వాటి ఏర్పాటునకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విశాఖపట్నం మర్రిపాలెంకు చెందిన మర్రిపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంఘం అధ్యక్షుడు కొమ్మూరి శ్రీను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో మహిళా, శిశు, వికలాంగ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వం ‘ది మెయింట్‌నెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్’ పేరుతో చట్టాన్ని తీసుకువచ్చిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిందని పిటిషనర్ తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం తల్లిదండ్రులు, వృద్ధుల కోసం పోషణకు సంబంధించిన కేసులను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. అదే విధంగా సెక్షన్ 19 ప్రకారం ప్రతీ జిల్లాలో 150 మందికి సరిపడే విధంగా వద్ధాశ్రమాన్ని నిర్మించాలని, ఆ ఆశ్రమంలో ఉండే వృద్ధులకయ్యే వైద్య, ఇతర సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాలని చట్టం స్పష్టం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్వయం పోషణ చేసుకునే శక్తి లేక బిక్షాటన చేస్తూ, హోటళ్లు పారవేసిన తిండి తింటూ వద్ధులు కాలం వెళ్ల దీస్తున్నారని, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వెంటనే చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.