ముంచుకొస్తోంది..!
=ఆధార్‌తో గ్యాస్ అనుసంధానానికినేటితో గడువు పూర్తి
=ఇప్పటి వరకు 25 శాతమే నమోదు
=నమోదు చేయించుకోని వారు 6.18 లక్షల మంది
=పరిస్థితుల దృష్ట్యా గడువు పెంచే అవకాశం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవడానికి గడువు మంగళవారంతో ముగుస్తోంది. కానీ ఇప్పటి వరకు కేవలం 2.05 లక్షల మంది మాత్రమే నమోదు చేయించుకున్నారు. 6.18 లక్షల మంది ఇంకా నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఇంకా నమోదు చేయించుకోని వారు గడువు ముగిశాక అంటే జనవరి 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే జిల్లాలో 6.18 లక్షల మంది నాన్‌సబ్సిడీ ధర రూ.1077 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అధిక శాతం మంది అనుసంధానం చేయించుకోకపోవడంతో గడువు పెంచాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. దీన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
గ్యాస్ సబ్సిడీ డబ్బును వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువునిచ్చింది. అలా అనుసంధానం చేసుకున్న వారికే సబ్సిడీ సిలిండర్లు లభిస్తాయని ప్రకటించింది. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 25 శాతం మంది అంటే 2.05 లక్షల మంది మాత్రమే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నారు.
అన్నింటిపై గందరగోళం
నగదు బదిలీకి ఆధార్‌తో కూడా అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆధార్ లేని వారికి నగదు బదిలీ కోసం వివరాలను సేకరించాలో? లేదో? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేకపోయింది.