
ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం
ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
తిరుపతి: ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం ఇక తప్పనిసరి అని.. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో ‘ఫొటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ-2015’పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి జనవరి 15 వ తేదీవరకు ఆధార్ అనుసంధానం ఉంటుందన్నారు. 2015 జనవరి ఒకటో తారీఖు నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు, సవరణ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నూతన ఓటర్లకు కలర్ ఫొటోతో కూడిన ఎపిక్ కార్డును జనవరి 25వ తేదీకల్లా అందజేస్తామని చెప్పారు. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7 తేదీల్లో ఓటర్ల సవరణ, నమోదుపై సంబంధిత బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు నూతన జాబితాలోనే ఉంటాయన్నారు.
శ్రీవారి సేవలో భన్వర్ లాల్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆయన ఆలయానికి వచ్చారు. శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.