రవాణా శాఖ చేపట్టిన ఆధార్ సీడింగ్ ప్రక్రియకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది.
వాహనాలకు ఆధార్ లింకేజీకి ఫిబ్రవరి 10 తుది గడువు
రవాణ శాఖలో 30 శాతం మాత్రమే సీడింగ్
నేడు రవాణా శాఖ అధికారులతో డీటీసీ సమావేశం
విజయవాడ : రవాణా శాఖ చేపట్టిన ఆధార్ సీడింగ్ ప్రక్రియకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. దీంతో రవాణ శాఖలో హడావుడి నెలకొంది. జిల్లాలో మొత్తం 5.87 లక్షల వాహనాలు, 4.84 లక్షల డ్రైవింగ్ లెసైన్స్‌ల వివరాలను రవాణా శాఖ సేకరించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు 3.70 లక్షల వాహనాలు, లెసైన్స్‌ల వివరాలు మాత్రమే సేకరించారు. టార్గెట్‌లో 30 శాతానికి మాత్రమే చేరుకున్నారు. మిగిలిన 70 శాతం లక్ష్యం చేరుకోవటానికి కేవలం 13 రోజులే మిగిలింది. అంటే రవాణా శాఖ అధికారులు రోజుకి సగటున 60 వేల వాహనాలు, లెసైన్స్‌లను అనుసంధానం చేయాల్సి ఉంది. గత నెలంతా అధికారులు కష్టపడినా 2.5 లక్షలు మాత్రమే ఆధార్ లింకేజీ చేశారు. వివిధ అధికారిక కార్యక్రమాలు, వరుస పండుగ సెలవులు, రహదారి భధ్రతా వారోత్సవాలు.. ఇలా వివిధ కారణాలతో 15 రోజులుగా జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
రూరల్ ప్రాంతాల్లో మోప్మా సిబ్బంది సహకారంతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు మెప్మా సిబ్బంది సంఖ్య తగ్గిపోవడంతో రూరల్ ప్రాంతాల్లో ఆధార్ సీడింగ్ సాగలేదు. ఆతర్వాత డెప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు అధికారులతో సమావేశాలు నిర్వహించి వేగవంతం చేయటానికి దశలవారీగా టీమ్‌లను ఏర్పాటుచేశారు. రవాణా శాఖ ఉద్యోగులతోపాటు 80 మంది వరకు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. ఆ తర్వాత 16 మంది మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు మండలలాల వారీగా టార్గెట్లు నిర్దేశించారు. కానీ, ఫలితం లేకుండాపోరుుంది.
మంత్రి శిద్దా ఆరా...
సోమవారం నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు జిల్లాలో ఆధార్ లింకేజీపై అధికారులతో మాట్లాడారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.