సాక్షి, అమరావతి : మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఎన్నికలు ముగియడంతో ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు జీవో నెంబర్ 882ను విడుదల చేశారు. గత నెల 26న కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయాలని ఆదేశించడంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 716 జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా జీవో లు విడుదల చేయటం వివాదాస్పదమైంది .అంతటితో ఆగక ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరిండచడంతో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ తర్వాత, డీజీపి ఠాకూర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. శాంతిభద్రతలతో పాటు, అవినీతి నిరోధకశాఖ డీజీగా ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తించేవారు. అదనపు బాధ్యతల నుంచి ఠాగూర్‌ను ఈసీ తప్పించింది. ఏసీబీ బాధ్యతలను శంఖ బ్రత బాగ్చికి అప్పగించారు. ఇంటెలిజెన్స్ బాధ్యతలను కుమార్ విశ్వజిత్‌కు అప్పగించారు. గత నెల 29నుంచి విధులకు దూరంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఏసీబీ డీజీగా నియమిస్తూ ఇప్పుడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టింగ్ అప్పగించాలని నిబంధన ఉండటంతో అవినీతి నిరోధక శాఖ బాధ్యతలు అప్పగించారు.
కాగా ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్‌ఎస్ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment