సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), రాష్ట్రానికి చెందిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మధ్య వివాదం మరింత రాజుకుంది. కేంద్ర ఉద్యోగిపై ఏసీబీ దాడి ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకూడదంటూ కొద్ది రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జీవోలో ప్రస్తావించినట్టే తాజాగా ఏసీబీ ప్రదర్శించిన దూకుడు ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఏసీబీ వ్యవహరించిన తీరును సీబీఐ సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి మెప్పుకోసం ప్రయత్నిస్తున్న కొందరు ఐపీఎస్‌లు ఇరకాటంలో పడే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. సీబీఐకి చెక్ పెడదామనుకుని అధికారులు కొత్త చిక్కుల్లో పడినట్టు అయ్యిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాష్ట్ర హోంశాఖ, ఏసీబీ బాస్ హడావుడిగా స్పందించారు. అనుమతి కోరిన సీబీఐ అధికారిని జాయింట్ ఆపరేషన్ చేద్దామని చెప్పినట్టు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాదు కాదు సీబీఐ కంటే తమకే ముందు బాధితుడు ఫిర్యాదు చేశాడని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకుర్ వివరణ ఇచ్చారు.
మాకే ముందు సమాచారం వచ్చింది: ఏసీబీ డీజీ
ఓ వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) సూపరింటెండెంట్(మచిలీపట్నం) ముక్కు కాళీ రమణేశ్వర్ గురించి తమకే ముందుగా ఫిర్యాదు అందిందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు అవినీతి చేస్తుంటే ఏసీబీ మౌనంగా చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. రమణేశ్వర్‌పై నవంబర్ 28న వ్యాపారి లోకేశ్ సీబీఐకి ఫిర్యాదు ఇచ్చాడని తెలిపారు. అంతకంటే ముందే నవంబర్ 22వ తేదీనే లోకేశ్ విజయవాడ ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడని అన్నారు. ఏసీబీకి లోకేశ్ ఫిర్యాదు చేసిన విషయం సీబీఐకి తెలియదన్నారు. ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగితే ఏసీబీ చర్యలు తీసుకుంటుం దని స్పష్టం చేశారు. సీబీఐ కంటే సమర్థవంతమైన యంత్రాంగం, వనరులు ఏసీబీకి ఉన్నాయని, రాష్ట్రం లోని అవినీతిపరులైన కేంద్ర అధికారులపై కూడా తాము దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయేషా మీరా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చి న తీర్పును తాము గౌరవిస్తామని ఠాకూర్ అన్నారు.
జాయింట్ ఆపరేషన్‌కు సీబీఐ ముందుకు రాలేదు: అనూరాధ
అవినీతి అధికారిపై జాయింట్ ఆపరేషన్ చేద్దామని కోరితే సీబీఐ ముందుకు రాలేదని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారి అవినీతిపై విశాఖపట్నం సీబీఐ ఎస్పీ నుంచి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సీబీఐ అధికారికి వివరించామన్నారు. అవినీతి అధికారిపై జాయింట్ ఆపరేషన్‌కు సీబీఐ ముందుకురాలేదని వెల్లడించారు. అవినీతి అధికారిపై సమాచారాన్ని ఏసీబీకి ఇస్తామంటే సీబీఐ ఒప్పుకుందన్నారు. సీబీఐ ఉమ్మడి దాడికి అంగీకరించకపోవడం వల్లే ఏసీబీ సొంతంగా చర్యలు తీసుకుందని వివరించారు. ఇకనుంచరి ఏపీలో అవినీతికి సంబంధించిన అన్ని కేసులను ఏసీబీనే దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment