ఏసీబీ వలలో అవినీతి చేప
ఖాజీపేట: వీఆర్వో అబ్రహం లింకన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నారుు. ఖాజీపేట మండలం నాగసానిపల్లె వీఆర్వోగా ఉంటూ తవ్వారిపల్లెకు ఇన్‌ఛార్జిగా అబ్రహం లింకన్ పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బి.విశ్వనాథరెడ్డి అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం దాదాపుగా రెండేళ్లుగా తిప్పుకుంటూ రూ.7వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
డబ్బు ఇవ్వలేక, వీఆర్‌ఓను పట్టించాలన్న ఉద్ధేశంతో ఆ రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఖాజీపేట బస్టాండు కూడలిలోని వీఆర్వో కార్యాలయంలో రైతు విశ్వనాథరెడ్డి వీఆర్వో అబ్రహం లింకన్‌కు డబ్బులు ఇచ్చాడు. ఆయన తీసుకున్న తక్షణమే ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీఆర్వో వద్దనున్న రికార్డులను, పాసు పుస్తకాలను తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎదుట సోదాలు నిర్వహించారు. అబ్రహం లింకన్‌పై కేసు నమోదుచేసి తమ వెంట తీసుకెళ్లారు.