వివరాలు సేకరిస్తున్న ఏసీబీ డీఎస్పీ, (అంతర చిత్రం) మున్సిపల్ సివిల్ ఇంజినీర్ ఫణిశ్రీనివాస్
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఏసీబీ దాడి సంచలనం రేపింది. సివిల్ ఇంజినీర్ జె.ఫణిశ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మద్దాల ధర్మాజీరావు పాలకొల్లు పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్ పనులు 17దక్కించుకున్నారు. ఈ పనులను 2018 మార్చి నెలాఖరుకు పూర్తిచేశారు. వీటి బిల్లులు తయారు చేయాల్సిందిగా సివిల్ ఇంజినీర్ ఫణి శ్రీనివాస్‌ను కోరారు. ఆయన చుట్టూ 8 నెలలుగా తిరుగుతున్నారు. లంచం ఇస్తేనే బిల్లు సిద్ధంచేస్తానని శ్రీనివాస్ చెప్పడంతో చేసేది లేక ధర్మాజీరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
వలపన్ని.. ధర్మాజీరావు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఫణిశ్రీనివాస్‌ను పట్టుకునేందుకు వలపన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పాలకొల్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ ధర్మాజీరావుకు రూ.50 వేలు ఇచ్చి ఇంజినీరింగ్ సెక్షన్‌లోకి పంపారు ఆ నగదును సివిల్ ఇంజినీర్ ఫణిశ్రీనివాస్‌కు ధర్మాజీరావు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఫణిశ్రీనివాస్ కవర్‌లో పెట్టుకున్నారు. వెంటనే అధికారులు ఫణిశ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ కె.శ్రీనివాసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది రెండో అవినీతి కేసు
పాలకొల్లు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు వందేళ్లు పూర్తికావస్తోంది. ఇప్పటివరకూ మున్సిపాలిటీలో ఇది రెండో అవినీతి కేసు అని స్థానికులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం మున్సిపల్ మేనేజర్ ఒక ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వడం కోసం లంచం అడిగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో మేనేజర్‌తోపాటు మరో సహ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
నాలుగేళ్లుగా ధర్మాజీరావు పనులు
కాంట్రాక్టర్ మద్దాల ధర్మాజీరావు నాలుగేళ్లుగా పాలకొల్లు పట్టణంలో సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం.. ఇటీవల ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా రూ.6.72 కోట్ల విలువైన 17 పనులను దక్కించుకున్నారు. వీటిని 2018 మార్చి నెలాఖరుకు పూర్తిచేశారు. అప్పటి నుంచి బిల్లులు పెట్టాలని ఇంజినీర్ ఫణిశ్రీనివాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, డీఈ, ఎస్‌ఈ, ఎమ్మెల్యేలతో చెప్పించినా పెడచెవిన పెట్టి తనకు లంచం ఇస్తేనే గానీ చేయనని ఫణిశ్రీనివాస్ మొండికేశారు. ఇంకా సుమారు రూ.3 కోట్ల విలువైన పనులకు బిల్లులు రావలసి ఉంది. సబ్‌ప్లాన్ నిధులు సమయానికి బిల్లు చేయకపోతే ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జనవరిలో ధర్మాజీరావు చేసిన సుమారు రూ.2 కోట్ల పనులకు బిల్లులు చేయడంలో ఇంజినీరు ఫణిశ్రీనివాస్ ఆలస్యం చేయడం వల్ల ఆ నిధులు ఏలూరు కార్పొరేషన్‌కు వెళ్లిపోయాయి. తరువాత బిల్లులు రావడంతో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి వచ్చిందని ధర్మాజీరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడూ ఇంజినీర్ ఆలస్యం చేయడం వల్ల నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే భయంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయిం చానని ధర్మాజీరావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పాలకొల్లు మున్సిపాలిటీలో తప్ప ఎక్కడా నిల్వ లేవు. ఆలస్యం చేయడంవల్ల లోటు ఉన్న మున్సిపాలిటీలకు ఆ నిధులను మళ్లించే అవకాశం ఉంటుంది. పాలకొల్లులో సుమారు రూ.5 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నిల్వ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment