కాకి లెక్కలు! | According to the terms of the delay at every step | Sakshi
Sakshi News home page

కాకి లెక్కలు!

Published Tue, Oct 28 2014 12:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

కాకి లెక్కలు! - Sakshi

కాకి లెక్కలు!

  • నిబంధనలతో సర్వేలో అడుగడుగునా జాప్యం
  •  గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక    ఇబ్బందులు
  •  చాలీచాలని బృందాలతో పంటల నష్టం అంచనా
  •  30వతేదీకి పూర్తి అసాధ్యం!
  •  మొక్కుబడిగా వచ్చి వెళ్లిన కేంద్ర బృందం
  • తుపాను నష్టం అంచనా తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో కాకిలెక్కలు వేస్తున్నారంటూ బాధితులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా చేసిన ఇళ్ల గణన.. చాలీచాలని బృందాలతో పంటల సర్వే.. పరిశ్రమల నష్టాల పరిశీలనకు మొక్కుబడిగా వచ్చి వెళ్లిన కేంద్ర బృందం.. రెండు వారాలు గడిచినా అందని పరిహారం.. ఇలా అనేక అంశాలు నష్టం అంచనాల రూపకల్పన విషయంలో విమర్శలకు తావిస్తున్నాయి.
     
    విశాఖ రూరల్ : హుదూద్ నష్టం సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల బృందాలు కాకిలెక్కలు వేస్తున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది. ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకంగా సర్వే బృందాలు వ్యవహరిస్తున్నాయి. కోటవురట్ల మండలం బి.కె.పల్లిలో సర్వే బృందాన్ని సోమవారం రైతులు నిలదీశారు. టేకు, సరుగుడు, కొబ్బరి మొక్కల నష్టాన్ని నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏటికొప్పాక చక్కెర మిల్లు డైరక్టర్ పెట్ల రాంబాబు తహశీల్దార్ శంకర్రావుకు ఫిర్యాదు చేశారు.

    అనకాపల్లి వెంకుపాలెంలో సర్వే బృందం సభ్యులంతా ఒక పాకలో కూర్చుని నష్టం అంచనాలను రాసుకుని వెళ్లిపోయారు. ఇవి సర్వే తీరుకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు బాధితులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంచనాల రూపకల్పనలో తీవ్ర జాప్యానికి కారణమవుతున్నాయి. తుపానుకు జిల్లాలో మొత్తం 1,18,761 ఇళ్లు దెబ్బతిన్నట్లు సర్వే బృందాలు లెక్క తేల్చాయి. పక్కా ఇళ్లు 72, కచ్చా ఇళ్లు 1809 పూర్తి గాను, పక్కాఇళ్లు 1337, కచ్చా ఇళ్లు 7366 తీవ్రంగాను, 9895 పక్కా ఇళ్లు, 57,942 కచ్చా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే 40,340 గుడిసెలు కూలిపోయినట్టు నిర్ధారించారు.

    ఈ వివరాలను జిల్లా అధికారులు అన్ని మండల, గ్రామ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఇందులో పేర్లు లేని బాధితులు సంబంధిత తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈమేరకు అనేక మంది దరఖాస్తులతో తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగడం సర్వేలో లోపాలకు నిదర్శనం. కాగా బాధితుల గుర్తింపు విషయంలోనూ కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. నష్టపోయిన ఇళ్లకు ఫొటోలు తీసి బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. గ్రామీణ ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా మెరుగుపడలేదు. దీంతో సర్వే బృందాలకు ఇచ్చిన ట్యాబ్‌లో బాధితుల వివరాలు పొందుపర్చడం సాధ్యం కావడం లేదు. ఫొటోలు  అప్‌లోడ్‌కూ జాప్యం జరుగుతోంది.  
     
    చాలీచాలని బృందాలతో అంచనాలు

    తుపానుకు ఆహార పంటలు 62,709 హెక్టార్లలోను, ఉద్యాన పంటలు 51,688 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీటి అంచనాకు 161 బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి సరిపోక ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి మరో 37 టీములను ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ గణన పూర్తికావాలి. ఇప్పటి వరకు మొత్తంగా 3500 హెక్టార్ల వరకు మాత్రమే సర్వే జరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో లక్ష హెక్టార్లలో పంట నష్టాలను గుర్తించడం అసాధ్యం. అంటే మరో రెండు వారాలకుపైనే సమయం పడుతుంది. అప్పుడే ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే పరిహారం మాత్రం ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు.
     
    మొక్కుబడిగా కేంద్ర బృందం

    తుపాను ధాటికి జిల్లాలో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 19 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1369.43 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టాలను పరిశీలించడానికి ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఇటీవల జిల్లాకు వచ్చింది. అధికారులు ఇచ్చిన అంచనాలను సేకరించి తిరుగుపయనమైంది. దెబ్బతిన్న పరిశ్రమలను మాత్రం పరిశీలించలేదు. అధికారుల నివేదికలు ఎలా ఉన్నా.. వచ్చిన వెళ్లిన కమిటీ కేంద్రానికి ఏ విధంగా నివేదిక అందజేస్తుందోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  
     
    వెంకుపాలెంలో వివాదం

    అనకాపల్లి: పంట నష్టం అంచనాలో సర్వే బృందాల విధానాలు విమర్శలకు తావిస్తున్నాయి. జీపీఆర్‌ఎస్ పద్ధతిలో గ్రామంలోని పంట నష్టానికి గురైన 30, 40 ఫొటోలను తీయడంతో పాటు వీడియో రికార్డింగ్ చేసి రైతుల పంటల విస్తీర్ణాన్ని బృందం సేకరించాలి. అయితే పంట నష్టం అంచనా వేసే బృందం ఒకేచోట కూర్చుని పాస్‌బుక్‌లో ఉన్న విస్తీర్ణాన్ని నష్టంగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి మండలం వెంకుపాలెంలో సోమవారం పాక కింద కూర్చుని పంట నష్టం అంచనా వివరాలు సర్వే బృందం సభ్యులు నమోదు చేశారు. అదేవిధంగా వెంకుపాలెం రామాలయంలో పంట నష్టంపై చర్చిస్తుండగా స్థానికుల మధ్య వివాదం చెలరేగింది. వాకపాలెంవైపు సర్వే చేయాలని కొందరు పట్టుబట్టగా, తాసుగోడుపాలెంవైపు సర్వే చేయాలని మరికొందరు పట్టుబట్టారు. దీంతో రామాలయం వద్ద కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement