
తిరుపతి రూరల్: తన హత్యకు టీడీపీ నేతలు రెక్కీ నిర్వహించారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. తిరుపతి తుమ్మలగుంటలో మంగళవారం సాయంత్రం ఆయన.. నిందితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాత్తు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి.. పులివర్తి నాని సహకారంతోనే ఇద్దరు రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఓటమి భయంతోనే తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఆ ఇద్దరికి రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి డ్రైవర్ల ముసుగులో తమ వద్దకు పంపారని, నెల రోజులుగా వారు తనతో పాటు, తన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారని చెప్పారు.
అయితే ఈ విషయాన్ని పసిగట్టి వారిని పట్టుకుని ఆరా తీయగా.. సుపారీ విషయాన్ని బయటపెట్టినట్టు చెవిరెడ్డి చెప్పారు. మొదటి దశలో ఇల్లు, ఆఫీసుకు సంబంధించి నిఘా పెట్టడంతో పాటు, తనను ఎవరెవరు కలుస్తున్నారు? మా కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడికి, ఏ దారిలో వెళ్తారు? ఎప్పుడొస్తారు? తదితర సమాచారాన్ని వారు సేకరిస్తున్నట్లు తెలిపారు. సమయాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో చెబుతామని నాని అనుచరులు తమకు ఆదేశాలిచ్చారని, నాని సహకారంతోనే తాము రెక్కీ నిర్వహించినట్టు నిందితులు.. చిత్తూరు పండ్రంపల్లికి చెందిన నాగభూషణం, సిసింద్రీలు మంగళవారం తుమ్మలగుంటలో మీడియాతో చెప్పారు.
విద్వేషాలు, కక్షతో వ్యవహరించడం బాధాకరం
శ్రీవారు కొలువైన తిరుపతిలో రెక్కీలు, హత్యలు వంటి సంస్కృతి లేదని చెవిరెడ్డి చెప్పారు. రాజకీయల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలే తప్ప.. విద్వేషాలతో వ్యక్తిగత కక్షతో వ్యవహరించటం బాధకరమన్నారు. నిందితులను చెవిరెడ్డి అర్బన్ ఎస్పీకి అప్పగించి, తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. కాగా, తనకు భద్రతను పెంచాలని ఇటీవల పోలీసులకు చెవిరెడ్డి వినతిపత్రం ఇచ్చినా ఇప్పటికీ స్పందించక పోవడం గమనార్హం. ఇప్పటికైనా చెవిరెడ్డికి రక్షణ కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment