
అక్కినేని లాంటి నటుడు మరోసారి జన్మించరు
నటనకే ఓనమాలు నేర్పిన అక్కినేని వంటి నటుడు మళ్లీ పుట్టరని, ఆయన లేనిలోటు తెలుగు చలనచిత్రానికి తీరనిదని మేయర్ స్వరూప, అనంత కళావాహిని సంస్థ వ్యవస్థాపకుడు వరం వెంకటేశ్వర్లు అన్నారు.
అక్కినేని జయంత్యుత్సవాల్లో మేయర్ స్వరూప
అనంతపురం కల్చరల్ : నటనకే ఓనమాలు నేర్పిన అక్కినేని వంటి నటుడు మళ్లీ పుట్టరని, ఆయన లేనిలోటు తెలుగు చలనచిత్రానికి తీరనిదని మేయర్ స్వరూప, అనంత కళావాహిని సంస్థ వ్యవస్థాపకుడు వరం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక కృష్ణకళామందిరంలో అక్కినేని జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో అక్కినేని చలన చిత్రాల సమాచారంతో కూడిన వాఖ్యానం చేసిన రమేష్ యాంకరింగ్ అందరినీ ఆకట్టుకుంది.
త్యాగరాయ సంగీత సభ నిర్వాహకుడు జ్ఞానేశ్వరరావు, అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు, బళ్లారి రాఘవ అవార్డు గ్రహీత మల్లేశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ అక్కినేనితో తమ అనుబంధాన్ని వివరించారు. దేవదాసు, కాళిదాసు, క్షేత్రయ్య ప్రేమనగర్, మేఘసందేశం వంటి చిత్రాలు భారతీయ సినీ వినీలాకాశంలో మెరిసే తారలన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినీ దిగ్గజాల జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్న వరం వెంకటేశ్వర్లను అభినందించారు. అనంత కళావాహిని సభ్యులు వరప్రసాద్, శ్రీకాంత్, మేడా సుబ్రమణ్యం, మహీధర్, రంగస్థల కళాకారుడు కోటి మల్లేశ్, డాన్స్‌మాస్టర్లు మక్బుల్, విష్ణు పాల్గొన్నారు.
అలరించిన అక్కినేని డూప్
సమావేశంలో అక్కినేని డూప్‌గా అనేక చిత్రాల్లో నటించిన కృష్ణారావు ప్రత్యేక ఆకర్షణగా నిలచారు. పలు వినోదకర సన్నివేశాలను అక్కినేనిని అనుకరిస్తూ చేసిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా శాస్త్రీయ నృత్యకళాకారిణి టీకే భవ్య అద్భుత నాట్యాలతో ఆకట్టుకుంది.