తపాలా సేవలంటే ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం అయ్యేవి. కానీ కాలానుగుణంగా భారత
తిరుపతి అర్బన్: తపాలా సేవలంటే ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం అయ్యేవి. కానీ కాలానుగుణంగా భారత ప్రభుత్వ శాఖల్లో భాగమైన తపాలాలో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎన్నెన్నో స్కీములు అమలులోకి వచ్చాయి. అందులో భాగంగా ఇప్పుడు తపాలా కార్యాలయాలు కూడా బ్యాంకులులాగా సేవలందిస్తున్నాయి. అలాగే ఇల్లు మారినప్పుడు, ఇతర గృహోపకరణాలు రవాణా చేయాలనేవారికి తపాలా ‘లాజిస్టిక్’ పథకం ద్వారా పూర్తి బీమా సౌకర్యంతో కూడిన పథకం అమలులో ఉంది. ఇదే పథకం ద్వారా రైతుల ఉత్పత్తులను కూడా మార్కెట్లకు తరలించుకునే సౌల భ్యం అందుబాటులో ఉంది. వివిధ తపాలా బీమా పథకాలు, చిన్నారుల కోసం కిడ్డీబ్యాంక్ సేవలు, బాలికల కోసం సంక్షేమ కార్యక్రమాలు...ఇలా ఎన్నెన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. వాట న్నిటిని గురించి ‘సాక్షి’ పాఠకులకు తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నుంచి ఒక్కో పథకం గురించి వివరించనున్నాం.
టీటీడీ ఆశీర్వచనం
ఆశీర్వచనం పథకాన్ని టీటీడీ సహకారంతో తపాలా శాఖ గత ఏడేళ్లుగా నిర్వహిస్తోంది.టీటీడీ అమలు చేస్తున్న వివిధ పథకాలతో పాటు శ్రీవారి హుండీకి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా మనీ ఆర్డర్ ద్వారా పంపవచ్చు. అలా టీటీడీకి విరాళాలు పంపిన భక్తులకు టీటీడీ వారి రశీదు, శ్రీదేవి-భూదేవి సమేత శ్రీవారి ఫొటో, శ్రీవారి ఆలయం ద్వారా పంపిణీ జరిగే అక్షింతలను కవర్‌లో పెట్టి పోస్టుమేన్ ద్వారా భక్తుల చిరునామాకు అందిస్తారు. అందుకోసం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగం నడుస్తోంది. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు.