మందులోనూ కల్తీ | Adulterated drugs | Sakshi
Sakshi News home page

మందులోనూ కల్తీ

Published Mon, Mar 23 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

మందులోనూ కల్తీ

మందులోనూ కల్తీ

  • వైన్‌షాపుల్లోని బాటిళ్లలో నీళ్లు కలిపి అక్రమ అమ్మకాలు
  •  ఎస్‌టీఎఫ్ దాడుల్లో వెలుగు చూస్తున్న నిజాలు
  •  నిజామాబాద్ మినహా మిగతా జిల్లాల్లో9 నెలల్లో 51 కేసులు
  •  బాటిళ్లు తెరిచి ఏమాత్రం అనుమానం రాకుండా మళ్లీ సీల్
  •  మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ప్రత్యేక నిపుణులు
  • సాక్షి, హైదరాబాద్: నిఖార్సైన మందు కూడా మద్యం దుకాణాల్లో దొరకడం లేదు. అన్ని చోట్ల కల్తీ మాదిరే మందు బాటిళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. డిమాండ్ ఉన్న, ఖరీదైన మద్యం బాటిళ్లలో నీళ్లు, చీప్‌లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ కల్తీ అధికంగా ఉంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) జరిపిన దాడుల్లో దొరికిన కల్తీ మద్యం సీసాల సీల్ చూసి అధికారులే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సీసాలో మద్యాన్ని ప్రయోగశాలలో పరిశీలిస్తే తప్ప కల్తీ అయినట్లు వారు గుర్తించలేకపోయారు. సీల్ చేసిన మద్యం సీసాలపై ఎక్సైజ్ శాఖ వేసే రంగుల లేబుళ్లను కూడా అంటిస్తారని, పర్మిట్ రూంలలో మందు బాబులు తాగేసిన లూజ్ సేల్ బాటిళ్లపైన ఉండే లేబుళ్లను తెప్పించి అనుమానం రాకుండా అతికించి విక్రయిస్తారని ఎస్‌టీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
     
    రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మినహా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు ఎస్‌టీఎఫ్ అధికారులు వైన్‌షాపులపై దాడులు చేసి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని దుకాణాలను సీజ్ చేశారు. జూలై నుంచి ఇప్పటి వరకు 51 కేసులు నమోదుచేసినట్లు ఎస్‌టీఎఫ్ అధికారి శశిధర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్ ముద్రించిన లేబుళ్లతో సీల్ చేసిన మద్యం సీసాలనే అమ్మాల్సి ఉన్నా దుకాణదారులు అదనపు ఆదాయం కోసం కల్తీకి పాల్పడుతున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులు, సిబ్బందికి మామూళ్లు ఇచ్చి వారి చేతులను కట్టేస్తున్నారు.
     
    కల్తీ ఎలా జరుగుతుందంటే...

    సాధారణ మూతలు ఉన్న సీసాలతో పాటు కల్తీకి అవకాశం లేకుండా సీసా మధ్యలో ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ తొడుగులు ఉండే ప్రీమియం మద్యం సీసాల మూతలను కూడా ఏమాత్రం అనుమానం రాకుండా తీసి యథాతథంగా అమరుస్తున్నారు. ఈ సీసాల మూతలు తీసే నిపుణులు హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ఉన్నట్లు సమాచారం. దుకాణ యజమానులు లేదా వారికి తెలియకుండా అందులో పనిచేసే వర్కర్లు సీసాల మూతలు తీసే నిపుణులను సంప్రదించి ప్రణాళిక బద్ధంగా కల్తీ చేస్తారు.

    రూ.300 నుంచి 450 ఎంఆర్‌పీ కలిగిన 750 ఎంఎల్ సాధారణ మద్యం సీసాలు 12 కలిగిన కేస్‌లను అజ్ఞాత ప్రాంతానికి తరలించి ఆ సీసాల మూతలు తీసి ఓ బకెట్లో మద్యం నింపి అందులో సగం వరకు నీళ్లు, కొంత చీప్ లిక్కర్ కలిపి మళ్లీ సీసాల్లోకి నింపుతారు. కొత్త బాటిల్‌పై ఉన్నట్లే సీల్ చేసి, వాటిపైన లేబుళ్లను కూడా అతికించి దుకాణాలకు తరలిస్తారు. ఇదంతా చేసినందుకు నిపుణులకు ఒక కేస్‌కు రూ. 1,000 వరకు చెల్లిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement