రాజీనామా యోచనలో వనమా..?
పీసీసీ షోకాజ్ నోటీస్‌పై గరం గరం
రాంరెడ్డి, సత్యవతిపై ఫిర్యాదుకు రెడీ..
సాక్షి, కొత్తగూడెం: నాయకుల అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరుతో జిల్లా కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా చెలరేగిన ‘భద్రాచలం’ చిచ్చు ఇంకా ఆరకపోగా మరింత రాజుకుంటోంది. ఈవిషయంలో అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేయడంతో డీసీసీ అధ్యక్షపదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భద్రాచలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే సత్యవతి ఫైర్ కావడంతో వనమా, ఎమ్మెల్యే మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఈ విషయంలో వనమా ఏకపక్షంగా వ్యవహరించారని ఎమ్మెల్యే.. ఆమె ఏకపక్షంగా వ్యవహరించారని వనమా వర్గీయులు ఒకరికొకరు మాటల యుద్ధం కొనసాగించారు. అయితే వనమాపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే సత్యవతికి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఇవ్వడంతో పంచాయతీ రచ్చకెక్కిందని ఆపార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇటీవల ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి వెంకటరెడ్డి మధ్య వివాదం చెలరేగడం, ఈ సందర్భంలో మంత్రి తీరును వనమా ఖండించడం తెలిసిందే. దీంతో సమైక్యవాది అయిన రేణుకకు జిల్లాలో వనమా కొమ్ముకాస్తున్నాడని మంత్రి వర్గీయులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరుణంలో భద్రాచలం ‘పంచాయతీ’ తెరపైకి రావడంతో ఎమ్మెల్యేకు అండగా ఉండి వనమాపై పీసీసీకి ఫిర్యాదు చేయించారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటు మంత్రి, అటు ఎమ్మెల్యే సత్యవతి ఒత్తిడితోనే పీసీసీ క్రమశిక్షణ సంఘం వనమాకు షోకాజ్ నోటీస్ జారీ చేసిందనే ఆక్రోశంలో వనమా వర్గీయులు ఉన్నారు. మంత్రి బలరాంనాయక్ మద్దతుతో భద్రాచలం పట్టణ అధ్యక్షుడి విషయంలో వనమా జోక్యం చేసుకోవడమే ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. అయితే తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న భద్రాచలంలో తనకంటూ ఒకవర్గం ఉండేలా బలరాంనాయక్ ఈవ్యవహారంలో చక్రం తిప్పినా.. చివరకు అది వనమా మెడకు చుట్టుకుంది.
రాజీనామా యోచనలో వనమా..?
పీసీసీ తనను సంప్రదించకుండా షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై వనమా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై.. కొన్ని సంవత్సరాల క్రితం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే షోకాజ్ నోటీస్ జారీచేస్తారా..? అని ఆయన ఈ విషయం తెలంగాణ మంత్రుల దృష్టికి తెసుకెళ్లినట్లు తెలిసింది. ఆయన డీసీసీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు ఇప్పటి వరకు జిల్లా రాజకీయంలో గాడ్‌ఫాదర్‌గా ఉన్న రేణుకాచౌదరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ విషయమై తన అనుంగు నేతలో ఇప్పటికే పలుమార్లు చర్చించారని, కొంతమంది వద్దని వారిస్తుండగా.. మరికొంతమంది పదవికి రాజీనామా చేస్తే మన సత్తా ఏంటో తెలుస్తుందని ఆయనకు సూచించినట్లు తెలిసింది.
మంత్రి, సత్యవతిపై ఫిర్యాదుకు సన్నద్దం..?
జిల్లాలో రేణుకాచౌదరికి మద్దతుగా ఉంటున్నందునే భద్రాచలం వ్యవహారాన్ని పీసీసీ స్థాయిలో మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి రాద్దాంతం చేశారని, దీనిపై తాడోపేడో తేల్చుకోవలసిందేనని వనమా సిద్ధమైనట్లు సమాచారం. ఇరువురిపై పీసీసీ, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు పూనుకున్నారని, రేణుక సూచనల మేరకే ఆయన అడుగులు వేస్తున్నారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పొడచూపిన విభేదాలు ఆరని కుంపటిలా ఉండడంతో పార్టీ ప్రతిష్ఠ నానాటికి దిగజారుతోందని ఆపార్టీలోని ద్విత్రీయ శ్రేణి నేతలు అసహనంతో ఉన్నారు.
ఆరని చిచ్చు... కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు
Published Tue, Nov 5 2013 6:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement