ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఏ ఫొటోల ఆధారంగా హైకోర్టు తమ వివరణ కోరిందో అందులో పలు ఫొటోలు మార్ఫింగ్ చేసినవని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు సుమోటోగా తీసుకున్న వ్యాజ్యంతో జత చేసి ఉన్న ఫొటోల్లో మార్ఫింగ్ చేసిన ఫొటోలున్నాయని తెలిపారు. బీహార్‌లో ఎప్పుడో జరిగిన ఘటన తాలూకు ఫొటోను ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల ఆందోళనతో ముడిపెట్టి మార్ఫింగ్ చేశారని కోర్టుకు వివరించారు. మిగిలిన ఫొటోల్లో చూపిన దానికి, క్షేత్రస్థాయిలో జరిగిన దానికీ చాలా తేడా ఉందని పేర్కొన్నారు. వాస్తవంగా జరిగిన ఘటన తాలూకు అసలు వీడియోలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కోర్టు ముందుంచుతామని తెలిపారు. అంతేకాక అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో తప్ప 2014 నుంచి 144 సెక్షన్ అమలు చేస్తూనే ఉన్నామన్నారు. వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తగిన వ్యవధినివ్వాలని హైకోర్టును శ్రీరామ్ కోరారు. స్పందించిన హైకోర్టు.. విచారణను 20కి వాయిదా వేసింది.
మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి
అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు హైకోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చింది. ఏ మహిళను కూడా సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫొటోల ఆధారంగా సుమోటో వ్యాజ్యం
144 సెక్షన్ విధించడమే కాకుండా, అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని, ఫొటోలను హైకోర్టు తనంతట తాను (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్) పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యానికి సదరు పత్రికలో ప్రచురితమైన ఫొటోలను, ఇతర ఫొటోలను హైకోర్టు జత చేసింది. అలాగే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధింపును సవాలు చేస్తూ పలువురు వేర్వేరుగా 8 పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఓ ప్రాథమిక కౌంటర్‌ను ధర్మాసనం ముందుంచారు. నిరసనకారులను కొడుతున్నట్లున్న ప్రచురితమైన ఫొటోలు మార్ఫింగ్ చేసినవని వివరించారు.
రక్తం కారుతూ ఉన్న ఆ మహిళ ఫొటో బీహార్‌లోని భాగల్‌పూర్‌లో గతంలో జరిగిన ఓ ఘటనలో గాయపడ్డ మహిళ అని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2017లో ఘటనలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫొటోలను ఇక్కడి అమరావతి ఆందోళనలతో ముడిపెట్టారని తెలిపారు. వాస్తవానికి అటువంటి ఘటనలేవీ ఇక్కడ జరగలేదన్నారు. మార్ఫింగ్ ఫొటోలను ప్రచురించడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. కోర్టు సైతం ఆ ఫొటోల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని, ఘటన పూర్తి క్రమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... నిరసనకారులు సైతం కొంత నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment