
తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన ఈయన పేరు గొట్టాపు సతీష్. ఈయన సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్ పోస్టులు రెండింటికీ అర్హత కలిగి ఉంటంతోరెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికి జిల్లా కేంద్రాన్ని వెబ్ ఆప్షన్స్‌గాపెట్టారు. అయితే ఉదయం పూట జరిగే సోషల్ పోస్టుకు శ్రీకాకుళం, అదే రోజు మధ్యాహ్నం పూట జరిగే ఇంగ్లిష్ పోస్టుకు విజయనగరం పరీక్ష కేంద్రాన్ని ఎలాట్ చేశారు. ఇప్పుడు రెండు పరీక్షలు ఎలా రాయాలో తెలీయక ఒక పరీక్ష మాత్రమే రాయగలుగుతాననీ, రెండో అవకాశం కోల్పోతున్నాననీ, రెండూ ఒకే పట్టణంలో రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నిరుద్యోగులకు డీఎస్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకున్న సమయంలో వచ్చిన సమస్యలు ఇప్పుడిప్పుడే ముగిశాయి. తాజాగా పరీక్ష కేంద్రాలకు ఎంపిక ఆప్షన్ కష్టాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఎస్‌జీటీ అభ్యర్థుల ఈ–ఎంపిక వెబ్ సైట్ ఆప్షన్ ద్వారా సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల పోర్టల్ సోమవారం ప్రారంభం అవ్వాలి. అయి తే సోమవారం సాయంత్రం వరకు ఎస్‌జీటీల ఆప్షన్ కాలమ్ తెరచుకోలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల పరీక్ష కేంద్రాల వెబ్ ఆప్షన్ ప్రక్రియలో విభిన్న సమస్యలను అభ్యర్థులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆప్షన్ పరిధి రాష్ట్రస్థాయిలో ఉండడం వల్ల కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని దక్కించుకోలేకపోతున్నారు.
జిల్లా కేంద్రంలో ఉన్న శిక్షణా కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇక్కడి పరీక్ష కేంద్రాలనే ఎంచుకోవడంతో ఆలస్యంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారికి పక్క జిల్లాల కేంద్రాలనుకేటాయిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పరీక్ష కేంద్రాలకు ఎదురైన ఈ సమస్య తెలుసుకున్న ఎస్‌జీటీ అభ్యర్థులు తొలిరోజే ఆప్షన్స్ పెట్టుకోవాలని తొందరపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. వెబ్ ఆప్షన్ పోర్టల్‌లో కనిపించకపోవడం చూసి ప్రభుత్వ కాల్ సెంటర్ 1100కి కాల్ చేసారు. ఈ నెల 16 నుంచి వెబ్ ఆప్షన్ ఓపెన్ అవుతాయని ఓరల్‌గా సమాధానం వచ్చింది. కానీ ఇదే సమాచారాన్ని అధికారికంగా వెబ్‌సైట్‌లో పెట్టి తెలియజేయజేస్తారని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17నుంచి హాల్ టిక్కెట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే కాల్ సెంటర్ నుంచి వచ్చిన సమాధానం దీనికి విభిన్నంగా ఉండడంతె అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు.
పోర్టల్‌లో కనిపించని పరీక్షల పొడిగింపు తేదీలు
డీఎస్సీ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను పొడిగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే ఆ తేదీలను డీఎస్సీ పోర్టల్‌లో ఇప్పటికీ పెట్టలేదు. ఇటీవల ముగిసిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ గుర్తింపు కార్డులు పాత తేదీలతోనే విడుదలయ్యాయి. అసలు పరీక్షల తేదీలు పొడింగించారో లేదోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్ధులు కంగారు పడుతున్నారు.
ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో రెండు పరీక్షలు
ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ వల్ల పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ ఏ జిల్లానైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ కేటగిరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వేర్వేరుగా పరీక్ష రాయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పోస్టులకు పరీక్ష ఉంటుంది. అయితే ఆ రెండు పరీక్షలు రాసే అభ్యర్థికి పరీక్ష కేంద్రాలు అందుబాటులో కేటాయించకపోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పరీక్షకు పక్కజిల్లాలో, మధ్యాహ్నం పూట జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను కేటాయించడంవల్ల అనేక మంది ఒక్క పరీక్షకే పరిమితం కావాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment