వైవీయూ, న్యూస్‌లైన్ : చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పడమే కాదు.. అవసరమైతే రాజకీయ నాయకులకు కూడా బుద్దిచెబుతామంటూ ఉపాధ్యాయులు తమ ఉద్యమపంథాను ప్రజాప్రతినిధులకు రుచిచూపించారు. తమ శిబిరంలోనికి రాజకీయ నాయకులకు ప్రవేశం లేదన్నారు. రాజీనామాలు చేసి ఆమోదించుకుని వచ్చిన తర్వాతే రావాలంటూ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాదనివస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ విరుచుకుపడ్డారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో నిరవధిక రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలకు సంఘీభావం ప్రకటించడానికి మంత్రి అహ్మదుల్లా ఆ ప్రదేశానికి రావడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు కోపోద్రిక్తులయ్యారు. గోబ్యాక్ అంటూ వెనక్కినెట్టివేశారు. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో పలువురు సమైక్యవాదులు చెప్పులు తీసుకుని మంత్రిపై విసిరారు. కొందరు చెప్పులు చేతికి తీసుకుని కొట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని మంత్రి అహ్మదుల్లాను వెనక్కితీసుకెళ్లారు.
పుత్తాతో సమైక్యవాదుల వాగ్వాదం..
టీడీపీ నాయకుడు పుత్తానరసింహారెడ్డి సమైక్యవాదులపై విరుచుకుపడే యత్నం చేశారు. మంత్రి అహ్మదుల్లాను వెంటబెట్టుకుని మళ్లీ శిబిరం వద్దకు వచ్చారు. ఉపాధ్యాయులు రెచ్చిపోయి పుత్తాను వెనక్కినెట్టారు. దీంతో కాసేపు వాగ్వాదానికి దిగిన పుత్తా ఉపాధ్యాయుల వాదన ముందు నిలువలేకపోయారు. కాంగ్రెస్ నాయకుడు కందుల శివానందరెడ్డి శిబిరం వద్దకు రాకుండానే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉపాధ్యాయ సమితి నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎవరైనా మద్దతుగా రావాలంటే రాజీనామాలు చేసి ఆమోదించుకున్న తర్వాతనే రావాలన్నారు. లేనిపక్షంలో వారు ఇటువైపు కూడా చూడొద్దని అల్టిమేటం జారీచేశారు.
అహ్మదుల్లా ‘గోబ్యాక్’
Published Tue, Aug 6 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement