ఎయిడ్స్ భూతం యువతను నీడలా వెంటాడుతుంది. అవగాహన లేమితో యువతీ, యువకులు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. ఈ దెబ్బకు కొన్ని కుటుంబాలే కనుమరుగవుతున్నాయి. భర్త మరణంతో భార్య.. తల్లుల మరణంతో పిల్లలు అనాథలవుతున్నారు
మెదక్, న్యూస్‌లైన్: ఎయిడ్స్ భూతం యువతను నీడలా వెంటాడుతుంది. అవగాహన లేమితో యువతీ, యువకులు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. ఈ దెబ్బకు కొన్ని కుటుంబాలే కనుమరుగవుతున్నాయి. భర్త మరణంతో భార్య.. తల్లుల మరణంతో పిల్లలు అనాథలవుతున్నారు. వ్యాధిసోకిన వారు తమకు తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తూ మృత్యువుకు బీజాలు వేస్తున్నారు. జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు తొమ్మిది వేల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్టు సమాచారం. ఈ వ్యాధిపై అవగాహన కల్పించే వారే లేకపోవడంతో మృత్యువు సమీపించే వరకు మహమ్మారి జాడలు తెలియడం లేదు. కనీసం హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం తరఫున పింఛన్లు కూడా అందక పోవడంతో వారి జీవితం నరకప్రాయమవుతోంది.
ఈ ప్రాంతాల్లోనే అధికం..
జిల్లాలోని పాపన్నపేట, జోగిపేట, అల్లాదుర్గం, గజ్వేల్, రామాయంపేట, సిద్దిపేట, దుబ్బాక, కొల్చారం, కోహీర్, సంగారెడ్డి, జహీరాబాద్ మండలాల్లో హెచ్‌ఐవీ బాధితులు అధిక సం ఖ్యలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
పచ్చని పల్లెల్లో మృత్యుఘోష..
అభం శుభం తెలియని పల్లె జనాలు క్షణికోద్రేకానికిలోనై ఈ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించే చట్టాలు లేనందున హెచ్‌ఐవీ ఎయిడ్స్‌గా మారిన తరువాతే బయట పడుతోంది. దీంతో మూడు పదులకే యువతీ యువకులు మృత్యువాత పడుతున్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో సుమారు 50 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరో 80 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్టు సమాచారం. ఇందులో 80 శాతం యువతీ యువకులు కావడం గమనార్హం.
పలు కుటుంబాల పరిస్థితి ఇది...
పాపన్నపేటకు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఈ వ్యాధిన బారిన పడి మృతి చెందారు. మూడేళ్ల క్రితం ఇద్దరు, నెల రోజుల క్రితం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఓ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు చనిపోగా, వారి భార్యలు సైతం వ్యాధి కోరలకు చిక్కారు. వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. వారి పిల్లలకు సైతం వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కొల్చారం మండలంలోని ఓ గ్రామంలో 220 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా అందులో ఎనిమిది మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ రావడం గమనార్హం.
అభాగ్యులకు ఆదరణ కరువు
హెచ్‌ఐవీ బారిన పడిన వారికి ఆదరణ కరువవుతోంది. వారిలో అవగాహన కల్పించి, జీవన నైపుణ్యాలు పెంపొందించి, మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన వారే లేకుండా పోతున్నారు. గతంలో ఐఆర్‌డీఎస్ (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్) ఆధ్వర్యంలో గ్రామాల్లో లింక్ వర్కర్లు పనిచేసే వారు. వీరు గ్రామాల్లో అనుమానితులను గుర్తించి ఐసీటీసీ కేంద్రానికి తీసుకెళ్లి రక్త పరీక్షలు చేయించి, అవసరమైతే ఏఆర్‌టీ(యాంటీ రెట్రో వైరల్ ట్రీట్‌మెంట్) ఇప్పించేవారు. ప్రస్తుతం ఈ స్కీం రద్దు కావడంతో గ్రామీణుల్లో అవగాహన కరువైంది. వ్యాధి బారిన పడి భర్తలు చనిపోయిన మహిళలకు కనీసం వితంతు పింఛన్లు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.
వ్యాధినుంచి రక్షణ ఎలా?
నివారణే తప్ప చికిత్సలేని ఎయిడ్స్/హెచ్‌ఐవీ నుంచి ప్రజలు రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. రక్షణలేని లైంగిక చర్యల వల్ల, రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వ్యాపించే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన పొందాలి. అందుకు జీవన నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి. ‘హెచ్‌ఐవీ అంటే ఎయిడ్స్ కాదు. ఎయిడ్స్ అంటే మరణం కాదు’ అన్న విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ హెచ్‌ఐవీ సోకితే క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటే జీవిత కాలాన్ని సాధ్యమైనంత వరకు పొడిగించుకోవచ్చు.
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో కళాజాత.. అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు ఎయిడ్స్/హెచ్‌ఐవీపై అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 1.50 లక్షల మందికి అవగాహన కల్పించడం జరిగింది. హెచ్‌ఐవీపై అవగాహన కల్పించే బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు, ఆశ వర్కర్లకు, ఏఎన్‌ఎంలకు అప్పగించాం. పెళ్లికి ముందు ప్రతి జంట రక్త పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది.
- డానియల్, డీపీఎం,
ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు