► మూమూళ్ల కోసం దారులనే మార్చిన అధికారులు
► అధికారపార్టీ నేతల కోసం నిబంధనలకు సడలింపులు
► ఎక్సైజ్‌శాఖ అధికారుల వింత పోకడ
సాక్షి, అమరావతి బ్యూరో : మద్యం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్న అధికార పార్టీ నాయకులకు ఎక్సైజ్ అధికారులు రాచబాట వేస్తున్నారు. అధికార పార్టీ నేతల ప్రాపకంతో పాటు వారిచ్చే మామూళ్ల కోసం నిబంధనలకే కొత్త భాష్యం చెబుతున్నారు. బడి, గుడి, ఆస్పత్రులకు 100 మీటర్ల దూరం తరువాతే మద్యం షాపులకు అనుమతి ఇవ్వకూడదని చెబుతున్న నిబంధనలకు సవరణలు చేసి దొడ్డిదారిలో అనుమతులు ఇచ్చేశారు. విజయవాడ నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు, బార్లకు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయిన వారి కోసం దారుల కొలతలనే మార్చేసిన అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను ఏమార్చిన విషయమై విజయవాడ ఎక్సైజ్ శాఖ ఏసీ సత్యప్రసాద్‌ను వివరణ కోరగా నిబంధనల విషయంలో సడలింపు జరగదని తెలిపారు. కొలతలు సక్రమంగా ఉంటేనే అనుమతులు ఇస్తామని చెప్పారు.
రమేష్ హాస్పిటల్ వద్ద ఇలా..
విజయవాడ లబ్బీపేట పరిధిలోని బందరు రోడ్డు ర‡మేష్ హాస్పిటల్‌కు ఎదురుగా ఉండే వైన్‌కార్నర్ షాపు అధికార పార్టీ నేతకు చెందింది. 30 పడకల హాస్పిటల్‌కు వంద మీటర్లు దూరం తరువాతే మద్యం షాపు ఉండాలన్నది నిబం ధన. నడిచే దారి కూడా వంద మీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్సైజ్ అధికారులు కొలతలు తీయడంతో చాకచక్యంగా వ్యవహరించారు. మద్యం షాపు నుంచి అవతలవైపునకు నడిచివెళ్లే దారి ప్రకారం చూస్తే సుమారు 60 మీటర్లు ఉంటుంది. కానీ అధికారులు ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధమంటూ రోడ్డును మూయించి, అవతల ఉన్న డివైడర్ వరకు దారి మళ్లించేలా చేసి, వందమీటర్లుకు పైగా దారి చూపించి అనుమతులు ఇచ్చేశారు. దీనికి పోలీసుల సహకారం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
మనోరమా వద్ద ఇలా..
బందరు రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో మనోరమ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నాయి. ఆ బార్ వెనుక నుంచి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి 500 మీటర్లు దూరం లోపు ఉంది. అయితే హోటల్ పక్కరోడ్డులో నోఎంట్రీ బోర్డు పెట్టించి.. రోడ్డు ముందు భాగం నుంచి కొలతలు తీసి, 500 మీటర్లపైగా దూరం చూపించి అనుమతులు ఇచ్చేశారు. ఆ బార్ కోసం ప్రజలు నడిచే రోడ్డునే బ్లాక్ చేయించడం గమనార్హం.
పున్నమి ఘాట్ వద్ద..
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలోనే ఉన్న పున్నమిఘాట్‌లో టూరిజం శాఖ బార్ ఏర్పాటు చేసింది. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో బార్ ఉండాలన్న నిబంధనలను ప్రభుత్వ అధికారులే ఉల్లంఘించారు. జాతీయ రహదారికి కేవలం 300 మీటర్ల లోపే ఉండే కాటేజ్‌లో మూడో అంతస్తులో బార్ ఓపెన్ చేసి బోర్డు మాత్రం పెట ్టలేదు. రహదారి నుంచి నేరుగా ఘాట్‌లోకి వెళ్లే దారిని మూసివేసి, దూరంగా ఉన్న మరో మార్గాన్ని చూపించారు. అప్పటికీ 500 మీటర్ల కొలత రాకపోవడంతో మూడో అంతస్తులో ఉన్న బార్ వరకు కొలతలు చూపి అనుమతి తీసుకున్నారని సమాచారం.
నిబంధనలన్నీ బేఖాతరు
గుంటూరు(లక్ష్మీపురం): స్థానిక జూట్‌మిల్లు రోడ్డు నుంచి స్వామి థియేటర్ వైపుగా వెళ్లే ప్రదేశంలో మసీదు ఉంది. అదే ప్రాంతంలోని రోడ్డుకు ఎదురు భాగంలో అయ్యప్పస్వామి వారి దేవాలయం ఉంది. మసీదుకు ఎదురుగా, అయ్యప్ప స్వామి ఆలమం పక్కగా ఎస్ వైన్స్ పేరుతో మద్యం దూకాణం ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండటంతోపాటు పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. నిబంధనల ప్రకారం బడి, గుడికి వంద మీటర్లకు అవతల మాత్రమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకొనే వీలుంటుంది. అయితే వంద మీటర్ల దూరాన్ని అష్ట వంకర్లు తిప్పి నిబంధనలన్నింటికీ చెల్లుచీటి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మద్యం దుకాణం ఆలయాలకు వంద మీటర్ల కంటే తక్కువ దూరం ఉంటుంది. అధికారులు ఎలా అనుమతులిచ్చారో అర్థం కావడం లేదు.
రోడ్లపైనే మద్యం బాబుల హల్‌చల్
మంగళగిరి: పట్టణంలోని గౌతమబుద్ధారోడ్ వెంట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆటోనగర్ వరకు మద్యం దుకాణాలు, బార్‌లు వెలిశాయి. మద్యం ప్రియులతో మూడు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి గౌతమబుద్ధారోడ్డుపైకి స్థానికులు రావాలంటేనే హడలిపోతున్నారు. మద్యం ప్రియులందరూ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆయా దుకాణాల వద్ద వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో పట్టణం నుంచి ఆటోనగర్, ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి, చినకాకాని మీదుగా గుంటూరు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దుకాణంలో మద్యం తాగేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు లేకపోవడంతో రోడ్లపైనే గ్లాసులతో మందుబాబులు దర్శనమిస్తున్నారు. ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును స్థానికులతో కలిసి అడ్డుకుంటున్న కౌన్సిలర్లు..వ్యాపారుల వద్ద వాటాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఇప్పటికే 17 దుకాణాలు ఏర్పాటు చేయగా మరో 3 నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే బార్‌లు 14 ఉండగా ఇప్పటికే 13 ప్రారంభించారు. మరొకటి ఆటోనగర్‌లో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.