
డీఈవో కార్యాలయంలో ట్యాబ్‌లు సిద్ధం చేస్తున్న టెక్నీషియన్లు
కృష్ణాజిల్లా, మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల పరీక్షలు ట్యాబ్‌ల ద్వారానే నిర్వహించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. భవిష్యత్‌లో పేపరు, పెన్ను అనేది ఉపయోగించకుండా, పరీక్షల కోసమని ట్యాబ్‌లనే ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రామీణ విద్య బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేస్తున్నప్పటకీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించటం లేదనే జాతీయస్థాయి విద్యారంగ నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో డిజిటల్ విధానం ద్వారానే విద్యా బోధన సాగాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇందుకనుగుణంగా మార్పులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే డిజిటల్, వర్చువల్ తరగతుల బోధన సాగుతుండగా, తాజాగా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
ట్యాబ్‌ల ద్వారానే పరీక్షలు..
భవిష్యత్తులో విద్యార్థులు అన్ని రకాల పరీక్షలను ట్యాబ్‌ల ద్వారానే పూర్తి చేసేలా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని రకాల పోటీ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సత్తా ఉన్నప్పటికీ వీటిని ఎదుర్కోలేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే వీటిపై అవగాహన ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీంతో సర్కారు బడుల్లో ప్రాథమిక పాఠశాలల స్థాయిలోనే ట్యాబ్‌ల వినియోగంపై విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నారు.
3, 4 తరగతుల విద్యార్థులపై ప్రయోగం
ప్రాథమిక పాఠశాలల్లోని 4, 5 తరగతుల విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా పరీక్షలు రాసేందుకు తొలిప్రయోగం చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను ప్రస్తుతం ట్యాబ్‌ల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా తరగతుల పాఠ్యాంశాల్లోని అంశాలతో తయారు చేసిన ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లో సిద్ధం చేశారు. విద్యార్థికి ఒక ట్యాబ్ ఇచ్చి, ట్యాబ్ ద్వారానే పరీక్షను ఎదుర్కోవాలని సూచిస్తారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ట్యాబ్ ద్వారా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కో పేపరులో 40 ప్రశ్నలు ఉంటాయి. రెండు సబ్జెక్టులను 1.20 గంటల్లో పూర్తి చేయాలి. సమయం దాటితే ప్రశ్నాపత్రం స్క్రీన్‌పై కనిపించదు. ఎంత సమయం ఉందనేది విద్యార్థి తెలుసుకునేలా ట్యాబ్‌లో పొందుపరిచారు.
జిల్లాలో 23 పాఠశాలలు ఎంపిక
ట్యాబ్‌ల ద్వారా పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులను సన్నద్ధం చేసే క్రమంలో దీనిపై ఎలా ముందుకెళ్లాలనేది తెలుసుకునేందుకు జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ మండలాల్లోని 21 పాఠశాలలను ఎంపిక చేశారు. మచిలీపట్నం మండలంలో 9, గుడివాడలో 7, నూజివీడు మండలంలో 7 పాఠశాలల్లో ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి విజయంతానికి గాను 16 మంది సీఆర్‌పీలను ఎంపిక చేసి, వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
ప్రయోగానికి ప్రత్యేక యాప్
ట్యాబ్‌లపై పరీక్షల నిర్వహణకు విద్యార్థులకు అవగాహన కల్పించి, దీని అమల్లో సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ స్థాయిలో గల ఓ ఏజెన్సీకి అప్పగించారు. సెంటర్ ఫర్ స్వే్కర్ ఫౌండేషన్ (ఎస్‌ఎస్‌ఎఫ్) పేరుతో సదరు సంస్థ ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ప్రశ్నావళి నిక్షిప్తమై ఉన్న యాప్‌ను ట్యాబ్‌ల్లో సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు సలోమీ గుప్తా, దేవికా కపాడియా, నీల్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఇందుకు సంబం«ధించిన పనులు టెక్నీషియన్‌లు చేస్తున్నారు. ఈ వారంలోనే పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ట్యాబ్‌లపై ప్రయోగ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment