గుంటూరులో ఎయిమ్స్!
న్యూఢిల్లీ : గుంటూరు జిల్లాలో ఎయిమ్స్ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ప్రతిపాదించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. కాగా ప్రతి రాష్ట్రంలోనూ 'అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ' (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఆ మేరకు తగిన ప్రాంతాల్లో స్థలాలు గుర్తించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరింది.
ఎయిమ్స్కు స్థలం కేటాయింపులో కొన్ని సమస్యలున్నాయని, ఒక్కో సంస్థ ఏర్పాటు చేయడానికి 200 ఎకరాల దాకా అవసరం అవుతాయని మంత్రి చెప్పారు. ఒక్కో ఎయిమ్స్ కు దాదాపు రూ.1500 కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం గుంటూరు జిల్లాలో స్థలం ప్రతిపాదించిందని తెలిపారు. కాగా కొత్త ఎయిమ్స్ ఏర్పాటు ఎంత కాలంలో చేయాలన్నదానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేదని ఆయన వివరించారు.