విభజనతో అన్నీ సమస్యలే | All of the problems with the bifurcation | Sakshi
Sakshi News home page

విభజనతో అన్నీ సమస్యలే

Published Sat, Aug 10 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

All of the problems with the bifurcation

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు జరగనున్న అన్యాయాలను వివరిస్తూ శుక్రవారం ఉపాధ్యాయ జేఏసీ నాయకులు సమగ్ర నోటును విడుదల చేశారు. విద్య, ఉద్యోగ, విద్యుత్, సాగునీరు, ఆస్తులు, ఆదాయాలు వంటి అంశాల్లో సీమాంధ్ర ఎలా నష్టపోనుందో అందులో వివరించారు. తెలంగాణా ఆస్తులు, ఆదాయాలు పొందడం ద్వారా ఎలా లబ్ధి పొందనున్నదో అందులో పేర్కొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ పి.సుదర్శన్‌రెడ్డి ఈ నోటును రూపొందించారు. ఇందులోని వివరాలను పరిశీలిస్తే...
 
 రాష్ట్ర జనాభా 8.46కోట్లు ఉండగా, అందులో 60శాతం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోనూ, 40శాతం తెలంగాణాలో ఉన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ, ల్యాండ్ రెవెన్యూ ద్వారా మొత్తం 69146.5 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి 24శాతం, రాయలసీమ నుంచి 6శాతం, తెలంగాణా నుంచి 20శాతం ఉండగా, కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 50శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చివరి నాటికిలెక్కలు తీస్తే రాష్ట్ర మొత్తం అప్పు 1.79లక్షల కోట్ల రూపాయలు ఉంది.
 
 ఇందులో సీమాంధ్ర అప్పు 1.05లక్షల కోట్లు కాగా, తెలంగాణా అప్పు 74వేల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్ర ఆదాయం 70వేల కోట్ల రూపాయలు ఉండగా అప్పు 1.79లక్షల కోట్ల రూపాయలు ఉంది. హైదరాబాద్‌తో కలిపి తెలంగాణా వాటాగా వచ్చే ఆదాయం 49వేల కోట్ల రూపాయలు కాగా, అప్పు 74వేల కోట్ల రూపాయలు, ఇక సీమాంధ్ర ఆదాయం 21వేల కోట్ల రూపాయలు కాగా, అప్పు  లక్షా 5 కోట్ల రూపాయలు. తెలంగాణాకు ఆస్తిలో అప్పు 34శాతం కాగా, సీమాంధ్రకు ఆస్తిలో అప్పు 80శాతంగా ఉంది. అంటే సీమాంధ్రలో ఒక్కొక్కరి తలమీద 21,212 రూపాయలు అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. మద్రాసు, నైజాంల నుంచి విడివడి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగాక కేంద్రానికి పడ్డ అప్పును చెల్లించడానికి 1975వ సంవత్సరం వరకు పట్టింది.
 
 
 ఇప్పటి పరిస్థితుల్లో సీమాంధ్రులు తమ అప్పులు తీర్చాలంటే కనీసం వంద సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు సంభవిస్తే మూడు తరాల్లో కూడా అప్పు తీరే అవకాశం ఉండదు. విద్యాపరంగా చూస్తే ఆర్టికల్ 371-డి ద్వారా తెలంగాణా ప్రాంత పరిధిలోని చాలా ప్రాంతాలు హైదరాబాద్ కిందికి వస్తున్నాయి.
 
 దీంతో అక్కడి విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా విద్య అందడం వల్ల ఆర్థిక వెసలుబాటుకు వీలుంటుంది. కానీ సీమాంధ్రలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎయిడెడ్  విధానం వల్ల ఇక్కడి విద్యార్థులు ఆర్థిక భారాన్ని మోయాల్సివుంటుంది. ఉద్యోగ విషయానికొస్తే జోనల్ నియామకాలు చేపట్టారు. 610 జీఓ ద్వారా తెలంగాణా ప్రాంతంలో ఉద్యోగాల్లో ఏర్పడిన అసమానతలను తొలగించారు. విద్య,ఉద్యోగ పరంగా ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశముంటుంది.
 
 రాష్ట్రంలో అన్ని రకాల బ్యాంకులు 9,640 ఉన్నాయి. ఎస్‌బీహెచ్, ఆంధ్రా బ్యాంక్ జాతీయ ప్రధాన కార్యాలయాలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉంది. కానీ సీమాంధ్రలో  మాత్రం ఒక్క జాతీయ బ్యాంక్ కార్యాలయం కూడా లేదు. జెన్‌కో ఆస్తులు సీమాంధ్రలో 6,800కోట్ల రూపాయలు (35శాతం) ఉండగా తెలంగాణా ప్రాంతంలో 12,500 కోట్లు (65శాతం) ఉన్నాయి. అప్పు సీమాంధ్రలో 4,538 కోట్ల రూపాయలు (40శాతం) ఉండగా, తెలంగాణాలో 6,800 కోట్లు (60శాతం) ఉన్నాయి. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కోసం తెలంగాణాలో 99,871 కోట్ల రూపాయలకు అనుమతులు మంజూరు చేయగా, 2013 మార్చి వరకు ఖర్చు చేసిన వ్యయం 34,253 కోట్ల రూపాయలు, కోస్తాంధ్రలో 44,600కోట్ల రూపాయలు కేటాయించగా ఖర్చుచేసింది 19,098 కోట్ల రూపాయలు.
 
 రాయలసీమలో 24,688 కోట్ల రూపాయలకు అనుమతి ఇవ్వగా ఖర్చు చేసింది రూ.18,002కోట్లు 60శాతం జనాభా ఉన్న సీమాంధ్రలో ప్రాజెక్టుల కోసం కేటాయించింది 40శాతం కాగా, 40శాతం జనాభా ఉన్న తెలంగాణాలో 60శాతం కేటాయింపులు జరగడం గమనార్హం. తొమ్మిది జిల్లాలు కలిగిన తెలంగాణాలో 16 ఎత్తిపోతల పథకాలు ఉండగా, 13 జిల్లాలతో కూడిన సీమాంధ్రలో 15 మాత్రమే ఉన్నాయి. ఇక వందశాతం ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే  ఉంది. ఇలా ఏ అంశాన్ని పరిశీలించినా  సీమాంధ్ర కంటే తెలంగాణా ఎంతో ముందంజలో ఉంది. తాము వెనుకబడ్డామంటూ ఆ ప్రాంత నాయకులు చేస్తున్న వాదనల్లో నిజం లేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement