
హైకోర్టు తీర్పు తర్వాతే ఆళ్లగడ్డ ఉప ఎన్నిక
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
నవంబర్‌లో యువ ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ
ఒంగోలు: హైకోర్టు తీర్పు ఆధారంగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నిక విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని తెలిపారు. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేందుకు నవంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.
8 ఓట్లకు రూ.5లక్షల ఖర్చా..?
ఒంగోలులో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు చెప్పిన విషయం భన్వర్‌లాల్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలివీ...గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 6,276 సర్వీస్ ఓటర్లున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండటంతో ఎన్నికల అధికారులు అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించారు. అందుకుగాను రూ. 5లక్షల ఖర్చయింది. కానీ, ఓటు హక్కు వినియోగించుకున్నది 8మందే. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు.