
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నేడే నోటిఫికేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలు కానుంది. నామినేషన్ల పర్వం మొదలు కానుండడంతోనే రాజకీయ సందడి నెలకొననుంది. నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు.
నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. నామినేషన్ సమయంలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గానికి చెందిన 10 మంది ఓటర్లు బలపరచాల్సి ఉంది. నవంబర్ 8వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.
గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయి పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినందున ఎన్నికలు నిర్వహించారు. మరణించిన శోభా నాగిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. శోభా నాగిరెడ్డి భౌతికంగా లేకపోవడంతో మళ్లీ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.
ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ అభ్యర్థిగా దివంగత శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ప్రకటించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇది నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేలోపు స్పష్టం కానుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈ ఏడాది జనవరి ఒకటిన ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం జరుగుతుంది.
మొత్తం ఓటర్లు 2,20,812 మంది ఉండగా, ఇందులో మహిళలు 1,11,997 మంది, పురుషులు 1,08,800 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. గత నెల చివరి వారం నుంచి ఈనెల 10వ తేదీ బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే చేసి చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీలు, గ్రామాలు వదిలి వెళ్లిన వారిని గుర్తించడంతో పాటు అర్హులైన వారి నుంచి ఫారం-6లు కూడా స్వీకరించారు. ఇందులో ఓటర్ల సంఖ్యలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుతం 267 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అదనంగా 8 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
నియోజకవర్గాన్ని సందర్శించిన కలెక్టర్
నామినేషన్ల ఘట్టం మంగళవారం నుంచి మొదలు కానుండటంతో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ సోమవారం నియోజకవర్గాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమై నామినేషన్లలో ఎలా వ్యవహరించాలనేది వివరించారు. ఎన్నికను పకడ్బందీగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు మండలానికి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్‌ను నియమించారు. అక్రమ మద్యం, నగదును అరికట్టేందుకు 12 చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.
ఇది ఎన్నికల షెడ్యూలు :
నామినేషన్లు - ఈ నెల 14 నుంచి
21వ తేదీ వరకు
పరిశీలన - ఈనెల 22న
ఉపసంహరణ - ఈనెల 24న
పోలింగ్ - నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న