
జగన్ ప్రాభవాన్ని తగ్గించేందుకే వైఎస్‌పై నిందలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ప్రాభవాన్ని తగ్గించేందుకే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రె స్, టీడీపీ నాయకులు నిందలు వేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుయ్యబట్టారు.
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ప్రాభవాన్ని తగ్గించేందుకే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రె స్, టీడీపీ నాయకులు నిందలు వేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం ఆయన తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి వద్ద ధర్నా చేశారు. వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోరుతూ 2001 ముందే కేంద్రానికి వైఎస్ లేఖ రాసినట్లు అసత్యాలు పలుకుతున్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్‌కున్న అభిమానాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.
2009 ఎన్నికల్లో భాగంగా వైఎస్ నంద్యాలలో మాట్లాడుతూ తెలంగాణా ఇస్తే, సీమాంధ్రులు హైదరాబాద్ వెళ్లడానికి వీసా తీసుకోవాలని చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ మరణానంతరం, తెలంగాణ సాధనకు అడ్డంకి తొలగిందని నాడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. విభజనకు సంతకం చేసి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి తొమ్మిది రోజులు తరువాత ప్రజాగ్రహానికి భయపడి పత్రికల ముందుకు వచ్చారన్నారు. చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారన్నారు. వీరు సమైక్యాంధ్ర కోరుకుని ఉంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వచ్చిన వెంటనే వ్యతిరేకించి ఉండాలన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదని పేర్కొన్నారు. లాఠీలకు, తుపాకీ గుండ్లకు వెరవకుండా, ముందుండి పోరాడే వాళ్లం కనుకనే రోడ్డు మీదకు వచ్చామని, ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఇటువంటి సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.