నంద్యాలలో ప్రజాస్వామ్యం ఖూనీ
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నంద్యాల నడి వీధుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం చంద్రబాబు వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.వందల కోట్లు వెదజల్లిన చంద్రబాబు దిగజారుడుతనాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలని కోరారు. డబ్బులుంటే చాలు ఎన్నికల్లో నెగ్గొచ్చని భావిస్తున్న చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా నంద్యాల ఓటర్లు తీర్పునిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబటి బుధవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గెలుపు కోసం ఇంతలా బరితెగించాలా?
‘‘నంద్యాల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేతుల్లో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యానికి గురైంది. పోలీసు యంత్రాంగం చంద్రబాబు చెప్పుచేతుల్లో నడిచింది. దొంగ ఓట్లు వేయించే దుస్థితికి టీడీపీ దిగజారింది. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డిపై దౌర్జన్యం చేసి, గాయపరిచారు. గెలుపు కోసం ఇంతగా బరితెగించాలా?’’ అని ప్రశ్నించారు.
జగన్ వస్తే టీడీపీకి భయం
మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల నుంచి బహిష్కరించాలని, కాకినాడకు వెళ్లకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పే అధికారం మంత్రి యనమల రామకృష్ణుడికి ఎక్కడిది? ప్రతి ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం అన్ని కోణాల్లో విచారిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్ కాకినాడకు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది. జగన్ వస్తే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవలేమని భయపడుతోంది’’ అని అంబటి అన్నారు.