
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు (ఆదివారం) రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు.
జనవరి 9న తుది జాబితా ప్రదర్శన
ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.