శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి , వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి , వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో చర్చ కీలకంగా మారిన నేపథ్యంలో బీఏసీ సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రాలేదని శోభానాగిరెడ్డి ఆనంను ఘాటుగా ప్రశ్నించారు. అయితే మంత్రులుగా తాము హాజరయ్యామని ఆనం బదులిచ్చారు. ప్రాంతాలవారీగా మంత్రులు విడిపోయినప్పుడు బీఏసీలో మీ కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉండదని శోభానాగిరెడ్డి విమర్శించారు.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికే పరిమితమైందని ఆనం చెప్పారు. దాంతో శోభానాగిరెడ్డి తమకు పార్టీ ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. అందుకే తాము సమైక్యం అన్న ఒక్కవాణినే చెబుతున్నామని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమకు పార్టీనే ముఖ్యమని అన్నిప్రాంతాల్లో తమ పార్టీని కాపాడుకోవడమే తమ ఉద్దేశమని ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు.