ధర్మవరం అర్బన్ / అనంతపురం న్యూసిటీ: కీళ్ల నొప్పులతో రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం. ఉదయం లేవగానే కీళ్లు పట్టేసినట్లుగా ఉండడం. కనీసం కదల్లేకపోవడం.. ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ల నొప్పి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లే. ఇటీవల కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులే అంగీకరిస్తున్నారు. జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో 26,125 మంది ఈ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చోసుకోవచ్చు.
20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. 18 ఏళ్లలోపు వారిలోనూ వ్యాధిని గుర్తిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తొలి దశలో అప్రమత్తమైతే పెద్దగా ప్రమాదం లేదని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదనివైద్యులు హెచ్చరిస్తున్నారు. కీళ్ల నొప్పుల్లో అనేక రకాలున్నా అత్యధిక శాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటోంది. ఒకప్పుడు వారంలో ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతుండగా.. ప్రస్తుతం రోజూ ముగ్గురు, నలుగురు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
చికిత్సలో జాప్యం చేస్తే...
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్సలో జాప్యం చేస్తే కళ్లు తడారిపోవడం(డ్రై), కంటి చూపు తగ్గిపోవడం, దద్దుర్లు రావడం.. దగ్గు, ఆయాసంతో పాటు గుండెచుట్టూ నీరు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. నరాలు పటుత్వం తగ్గిపోవడం, చేతివేళ్లు, కాలి వేళ్లు నల్లబడటం జరుగుతుంది. మధుమేహం, రక్తపోటులాగే ఈ వ్యాధి ఉన్న వారికి గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిర్ధారణ.. చికిత్స
కీళ్ల నొప్పులు వచ్చిన తొలిదశలో వైద్యులను సంప్రదిస్తే రుమటాయిడ్ ఫ్రాక్చర్, యాంటీ సీసీపీ అనే యాంటీబాడీస్ రక్తపరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వ్యాధి నిరోధకశక్తిలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు మందులు ఇస్తారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణాలు
♦ జన్యుపరమైన లోపాల ♦ వాతావరణ కాలుష్యం
♦ ఆహారపు అలవాట్లు ♦ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం
♦ వైరల్ ఇన్‌ఫెక్షన్ ♦ పొగ తాగడం
వ్యాధి లక్షణాలు
♦ కీళ్ల వద్ద నొప్పి, వాపు రావడం
♦ ఉదయం నిద్రలేవగానే 15 నిమిషాల వరకు కీళ్లు పట్టేయడం.
♦ రాత్రిపూట కీళ్ల నొప్పులతో నిద్ర పట్టకపోవడం.
♦ జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం
♦ కీళ్లలో గుజ్జు తగ్గిపోయి వంకరపోవడం
♦ ఎముకల్లో పటుత్వం(బోన్ డెన్సిటీ) తగ్గి చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్ కావడం.
Comments
Please login to add a commentAdd a comment