'చంద్రబాబు రైతు ద్రోహిగా మిగిలిపోతారు'
అనంతపురం: రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు రైతులకు కీడు కలిగిస్తున్నాయని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో 50 లక్షల మందిని రైతులే కాదంటూ... రుణమాపీ నుంచి వారిని దూరం చేశారని ఆరోపించారు. రైతులు రుణాలపై సక్రమంగా 4 శాతం వడ్డీ కట్టేవారని... కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల వారు 14 శాతం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రైతులు, బ్యాంకులకు ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోందని తెలిపారు. రైతు ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారని అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.