స్వయం ఉపాధి కల్పనలో లక్ష్యానికి దూరంగా మెప్మా
- నిర్దేశించిన లక్ష్యం 600 యూనిట్లు
- ఏర్పాటు చేసిన యూనిట్లు 179
- ఈ ఏడాది నుంచి ఎస్‌జేఎస్‌ఆర్ రద్దు
- ఎన్‌ఎల్‌యూఎం పేరిట అమల్లోకి సబ్సిడీ లేని కొత్త పథకం
సాక్షి, కర్నూలు: పట్టణ ప్రాంతాల్లోని పొదుపు గ్రూపు సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా వ్యక్తిగత, సామూహిక రుణాల అందజేతలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వెనుకబడింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.6 కోట్లతో స్వయం ఉపాధి పథకం(యూఎస్‌ఈపీ) కింద జిల్లాలోని నగరపాలక సంస్థ, తొమ్మిది పురపాలక సంస్థల్లో 600 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 179 యూనిట్లు మాత్రమే నెలకొల్పడం గమనార్హం. అదేవిధంగా సంఘం మొత్తానికి అర్బన్ ఉమెన్ సెల్ఫ్ ప్రోగ్రాం(యూడబ్ల్యుఎస్‌పీ) కింద ఆరు యూనిట్లకు గాను ఎమ్మిగనూరులో ఐదు, కర్నూలులో ఒక్కటి మాత్రమే ఏర్పాటు చేయించగలిగారు. కర్నూలు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు మినహా మిగిలిన ఆరు పురపాలక సంస్థల్లో లక్ష్యానికి అనుగుణంగా దరఖాస్తులు కూడా అందని పరిస్థితి నెలకొంది.
బ్యాంకర్లు అంగీకార పత్రాలు ఇవ్వకపోవడం.. యూనిట్ల స్థాపనలో స్పష్టమైన విధానాన్ని లబ్ధిదారులు పాటించకపోవడం.. ఈ విషయంలో మెప్మా సిబ్బంది సలహాలు, సూచనలను అందివ్వలేకపోవడం అందుకు కారణమవుతోంది. స్వయం ఉపాధి పథకాలకు రూ.25 వేల వరకు రాయితీ లభిస్తోంది. సంఘాల ద్వారా పొందే రుణాలకు రూ.3 లక్షల వరకు రాయితీ ఉంటుంది. ఈ రెండు పథకాలకు సంబంధించి పురపాలక సంస్థల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన పురోగతి పరిశీలిస్తే ఆ శాఖ పనితీరు ఇట్టే అర్థమవుతోంది. మొత్తం రూ.6 కోట్ల వ్యయంతో 606 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా.. నిధుల లేమి కారణంగా 179 యూనిట్లు (29.53 శాతం) మాత్రమే స్థాపించగలగడం గమనార్హం.
ఇదిలా ఉండగా స్వర్ణ జయంతి సహరీ రోజ్‌గార్(ఎస్‌జేఎస్‌ఆర్) పథకాన్ని ఈ ఏడాది నుంచి కేంద్రం రద్దు చేసింది. దీంతో ఈ పథకం ద్వారా మెప్మా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూఎస్‌ఈపీ కింద వ్యక్తిగత, సామూహిక రుణాల మంజూరు నిలిచిపోనుంది. అయితే కొత్తగా నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్(ఎన్‌ఎల్‌యూఎం) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్‌జేఎస్‌ఆర్ తరహాలో ఈ పథకం కింద రుణాలు పొందే లబ్ధిదారులకు సబ్సిడీ వర్తించదు.
కేవలం తక్కువ వడ్డీకి మాత్రమే రుణాలను అందజేస్తారు. ఈ కొత్త పథకం 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లోని స్వయం సహాయక సంఘాలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. వ్యక్తిగతంగా 1,038.. సామూహికంగా 14 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
నిధుల సమస్య ఉంది
ఈ ఏడాది రూ.6 కోట్ల నిధులు కేటాయించగా ప్రభుత్వం మూడు విడతల్లో రూ.70 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. వచ్చిన నిధులను మంజూరైన యూనిట్లకు కేటాయించాం. నిధుల సమస్యను సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి నివేదించాం. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో నిధుల సమస్య తలెత్తింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.
- రామాంజనేయులు, పీడీ, మెప్మా
వెనుకబాటు
Published Sun, Jun 8 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM
Advertisement