
ఏపీలో మద్యం అమ్మకాల జోరు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాదితో పోల్చిచూస్తే ఇప్పటివరకు మద్యం ఆదాయంలో పెరుగుదల 4.06 శాతం నమోదైంది.
- వ్యాట్ కాకుండా రూ.7,581 కోట్ల విలువైన మద్యం వినియోగం
- అగ్రస్థానంలో విశాఖ.. శ్రీకాకుళంలో అత్యల్ప విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాదితో పోల్చిచూస్తే ఇప్పటివరకు మద్యం ఆదాయంలో పెరుగుదల 4.06 శాతం నమోదైంది. అమ్మకాలపై విధించే వ్యాట్ కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల వరకు రూ.7,581 కోట్ల విలువైన మద్యం వినియోగం జరిగింది.
రాష్ట్రం జూన్ నుంచి విడిపోయినప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం ఏప్రిల్ నుంచి జిల్లాల వారీగా మద్యం విక్రయాలు, వ్యాట్ ఆదాయాలను విభజించింది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 188.07 లక్షల కేసుల మద్యం వినియోగం జరిగింది. అలాగే 122.58 లక్షల కేసుల బీరు వినియోగం జరిగింది. మద్యం వినియోగంలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో ఉండగా శ్రీకాకుళం జిల్లా చివరిస్థానంలో ఉంది.
విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం వినియోగం జరగ్గా, శ్రీకాకుళం జిల్లాలో రూ.364 కోట్ల విలువైన మద్యం వినియోగించారు. ఒక్క నవంబర్ నెలలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 25.45 లక్షల కేసుల మద్యం, 9,44 లక్షల కేసుల బీరు వినియోగం జరిగింది. వీటి విలువ రూ.947.47 కోట్లు.
ఈ నెలలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ రెవెన్యూ ద్వారా రూ.188.41 కోట్లు రాగా, విక్రయాలపై వ్యాట్ ద్వారా రూ.555.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్, వ్యాట్ ద్వారా మొత్తం రూ.744.09 కోట్ల ఆదాయం వచ్చిందన్నమాట.