తిరుపతిలో వసంతమ్మకు ఇంటివద్దే పింఛన్ అందిస్తున్న వలంటీరు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్: పింఛను డబ్బులు తీసుకోవడానికి అవ్వా తాతలు నడవలేని స్థితిలో అష్టకష్టాలు పడే రోజులు తొలగిపోయాయి. ఒకటో తేదీన ఉదయాన్నే నిద్రకూడా లేవక ముందే వలంటీరు ఇంటికి వచ్చి తలుపు తట్టి పింఛను చేతికి అందించే రోజులు వచ్చాయి. మార్చి 1వ తేదీ.. ఆదివారం.. సెలవు రోజు అయినా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ఒక్క రోజులోనే 87.61% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. 51,53,215 మంది లబ్ధిదారులకు అక్షరాలా రూ.1,272.87 కోట్లు అందజేశారు. పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు 92 శాతానికిపైగా పింఛన్ల పంపిణీ పూర్తి కావటం గమనార్హం.
తెల్లవారుజామునే ఇంటికే పింఛన్
అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెల పింఛను డబ్బులను అందజేసేందుకు ఆదివారం తెల్లవారుజామునే ఇళ్ల వద్దకు వలంటీర్లు రావడం చూసి పింఛనుదారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం భీమునిపాడులో వృద్ధురాలు నూతేటి గంగమ్మకు పొలం వద్ద పింఛన్ అందజేస్తున్న వలంటీరు
7 గంటలకే 7 లక్షల మందికి..
ఉదయం 7 కల్లా దాదాపు 7 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి కావడం గమనార్హం. 8 గంటల కల్లా 16,43,201 మందికి పెన్షను అందజేశారు. ఉదయం 9 గంటల సమయానికే మొత్తం లబ్ధిదారుల్లో సగానికంటే ఎక్కువగా 31,78,792 మందికి పంపిణీ పూర్తయింది. అంటే 54.04 శాతం. మధ్యాహ్నం 2 గంటలకు 47 లక్షల పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇంటిలో ఉన్నా.. పొలంలో ఉన్నా.. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా వలంటీర్ల అక్కడికే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. అర్హులైనప్పటికీ గత నెలల్లో పింఛను అందని వారికి ఫిబ్రవరి, మార్చి నెలల డబ్బులను వలంటీర్లు ఆదివారం ఒకేసారి అందజేశారు.
సత్తా చాటిన వలంటీర్ల వ్యవస్థ
సెలవు రోజు అయినప్పటికీ కేవలం గంటల వ్యవధిలో దాదాపు రూ.1,272.87 కోట్లను లబ్ధిదారులకు అందజేసిన వలంటీర్ల వ్యవస్థపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వలంటీర్ల వల్ల ప్రయోజనం ఏమిటో ఇప్పుడు అర్థమైందని పింఛను లబ్ధిదారుల కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. మార్చి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై ఉన్నతాధికారులు ఆదివారం సెలవు రోజు అయినా రియల్ టైం డేటాతో పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారుల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగింది.
మనవడా.. వెయ్యేళ్లు వర్థిల్లు
‘నా వయస్సు 85 ఏళ్లు. మాది గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేట. 15 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది. పెద్ద కుమారుడు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఇన్నాళ్లూ పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. నా మనవడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గతనెలలో మా ఇంటికే పింఛన్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే నేరుగా ఇక్కడికే వచ్చి పింఛన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. నాలాంటి వేల మందికి మేలు జరుగుతోంది. వెయ్యేళ్లు వర్థిల్లు మనవడా..’
ఉద్యోగులకు జీతం.. మాకు పింఛన్..
‘జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఒకటో తేదీన ఉద్యోగస్తుడికి జీతం ఇచ్చినట్లుగా పింఛను ఇస్తానన్నారు. ఇచ్చి చూపారు. ఆదివారం అయినా వలంటీరు మా ఇంటికి వచ్చి పింఛను డబ్బులు ఇచ్చి వెళ్లారు. గత నెలా ఇలాగే అందింది. గతంలో పింఛను కోసం చెట్టుకింద కూర్చోవాల్సి వచ్చేది. వేలిముద్ర పడకపోతే అంతా సాయంత్రం వరకూ నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు తెల్లవారుజామునే పింఛను ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.
– వంక పెద్దోడు, తంతడి అచ్యుతాపురం మండలం, విశాఖ జిల్లా
తలసేమియా బాధిత బాలుడికి రూ.10,000 పింఛను
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడులో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ఆదివారం రూ.10,000 పింఛను అందజేశారు. గ్రామానికి చెందిన పేరూరి శివశంకర్, మేరీకుమారి దంపతులకు ఆరేళ్ల క్రితం తొలి సంతానంగా నవీన్‌కుమార్ జన్మించాడు. అనంతరం ఏడాదిన్నరకు వివేక్ పుట్టాడు. పెద్ద కుమారుడు నవీన్‌కు పుట్టిన ఐదు నెలల నుంచి శరీర అవయవాల్లో కదలిక లేకపోవడంతో తుని, కాకినాడ ఆస్పత్రుల్లో చూపించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లారు. నవీన్‌కు తలసేమియా వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. శివశంకర్, మేరీకుమారి దంపతులు తమ కుమారుడి చికిత్స కోసం రూ.4 లక్షల దాకా ఖర్చు చేశారు.
చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే నవీన్ తండ్రి శివశంకర్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడి మందులకు నెలకు రూ.5 వేలకు పైగానే ఖర్చవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలసేమియా వ్యాధిగ్రస్తులకు పింఛను పెంచడం ఆ కుటుంబానికి వరంగా మారింది. గత నెలలో తన కుమారుడికి రూ.10,000 పింఛను మంజూరైందని మేరీకుమారి తెలిపారు. ఈ పింఛను రూ.10,000 నగదును స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు కోడూరి దివానం, గ్రామ వలంటీర్ పేరూరి వీర వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ఆదివారం మేరీకుమారి, నవీన్‌కుమార్ అందుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ పింఛను తమలాంటి పేదలకు ఆర్థికంగా కొండంత ఆసరాగా ఉంటుందని మేరీకుమారి ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment