రాష్ట్రపతి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్!
రాష్ట్రపతి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్!
Published Thu, Feb 20 2014 1:28 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
తదుపరి కర్తవ్యం?
సుప్తచేతనావస్థలో రాష్ట్ర శాసనసభ!
రాజ్యసభలో టీ-బిల్లు ఆమోదం తర్వాతే నిర్ణయం
అప్పటివరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కిరణ్
ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించని గవర్నర్
‘చాన్స్’ కోసం ఇరు ప్రాంతాల నేతల లాబీయింగ్
టీ-మంత్రులతో పాటు బొత్స, కన్నా ఢిల్లీలో మకాం
రాష్ట్రంలో వివిధ పాలనావకాశాలపై విస్తృత చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాష్ట్రపతి పాలన విధించేందుకు అంతర్గతంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందే వరకూ ఈ నిర్ణయాన్ని గోప్యంగా ఉంచాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. పెద్దల సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశమై రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అప్పటివరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆపద్ధర్మ (కేర్ టేకర్) ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ను కలసి.. సీఎం పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. తదుపరి నిర్ణయం వెలువడే వరకు కేర్‌టేకర్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాలని కిరణ్‌ను గవర్నర్ కోరారు. కిరణ్ అయిష్టంగానే ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా, అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం పంపుతున్నారు. కేంద్రం సూచనల మేరకు గురు లేదా శుక్రవారాల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేసే అవకాశాలు లేకపోలేదు.
పార్లమెంటు ముగిశాకే నిర్ణయం ప్రకటన...
కీలకమైన రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభ ముందున్న తరుణంలో రాష్ట్రపతి పాలన విధిస్తే రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తోంది. పైగా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంటే విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అలా జరిగితే ఉభయ సభల్లో ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న బిల్లులన్నీ ఆమోదం పొందటం కష్టమని యోచిస్తోంది. దీంతో.. రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకోవటానికి ముందుగా.. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందటంతో పాటు ఉభయ సభల ముందున్న కీలకమైనబిల్లులను కూడా ఆమోదింపజేసుకున పనిలో పడింది. ఈ నెల 21వ తేదీ (శుక్రవారం)తో పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ 21 లోపు పార్లమెంటులో కీలకమైన బిల్లులు ఆమోదం పొందని పక్షంలో మరో రెండు రోజులు సమావేశాలను పొడిగించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సమావేశాలను పొడిగించాల్సి వస్తే.. అవి ముగిసిన తరువాతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముంది. గురువారం ఉదయం కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతున్నప్పటికీ ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాల్లేవని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం కేంద్రం దృష్టి అంతా పార్లమెంటుపైనే కేంద్రీకరించింది. విభజన బిల్లుతో పాటు ఉభయ సభల ముందున్న కీలకమైన బిల్లులను ఆమోదించుకునే పనిలోనే నిమగ్నమైంది. ఆ ప్రక్రియ ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని పరిశీలిస్తుంది’ అని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి పాలన వద్దంటున్న రాష్ట్ర నేతలు...
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం మనుగడలో ఉంటేనే మంచిదని, ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేపట్టవచ్చని వారు పార్టీ పెద్దలకు నివేదిస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితి లేదని, తమలో ఒకరికి సీఎం బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ తదితరులు ఢిల్లీలోనే మకాం వేశారు. బుధవారం ఓ హోటల్‌లో వీరంతా సమావేశమై సీఎం రాజీనామా నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు వీరిలో ఎవరికి వారే సీఎం పదవి కోసం అంతర్గతంగా లాబీయింగ్ ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ద్వారా డిప్యూటీ సీఎం, గులాంనబీఆజాద్ ద్వారా జానారెడ్డి, అహ్మద్‌పటేల్ ద్వారా పొన్నాల సీఎం పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సీమాంధ్ర నేతలదీ అదే దారి...
ఇక సీమాంధ్ర నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర అర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మరో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కూడా సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. సీమాంధ్రలో పూర్తిగా బలహీనమైన కాంగ్రెస్‌ను కొంతవరకైనా గాడిలో పెట్టాలంటే పాలనా పగ్గాలు చేతుల్లో ఉంటేనే మేలని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి పాలన పెడితే మాత్రం పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని, ప్రజల్లోకి కూడా వెళ్లలేమని ఆందోళన చెందుతున్నారు. బొత్స, కన్నా ఇప్పటికే ఢిల్లీలోనే మకాం వేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సహా హైకమాండ్ పెద్దలను కలిసి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఇపుడేం జరుగుతుంది?!
సీఎం రాజీనామా నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనకు సంబంధించి ప్రస్తుతం గవర్నర్ ఎదుట ఉన్న పలు అవకాశాలపై కొంత చర్చ సాగుతోంది. అవేమిటంటే...
1) ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగించటం. ఐతే ఎఐసీసీ దానికి అంగీకరించకపోవచ్చునని సవూచారం.
2) వుుఖ్యవుంత్రి రాజీనావూను ఆమోదించాక వురో నాయుకుడికి సీఎంగా అవకాశం ఇవ్వటం. ప్రస్తుత స్థితిలో దీనికి కూడా ఎఐసీసీ అనువుతించకపోవచ్చుననీ అంటున్నారు.
3) మిగిలింది.. వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసి, రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలను కొలువుతీర్చటం. ఐతే ఇది సాధ్యం కావాలన్నా రాష్ట్ర విభజనపై గెజిట్ నోటిఫికేషన్ దాకా ఆగాల్సిందే. అప్పటివరకైనా రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం అసెంబ్లీని కొద్ది రోజుల పాటు సుప్తచేతనావస్థలో ఉంచాల్సి ఉంటుంది.
25వ తేదీ లోపే గెజిట్ నోటిఫికేషన్?
మూడో అవకాశంపై కేంద్రం దృష్టి సారించాలంటే వుుందుగా తెలంగాణ బిల్లు ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ జారీ పూర్తవ్వాలి. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో మీడియూతో మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ లోపే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యేలోగా గెజిట్ నోటిఫికేషన్ వ చ్చేస్తేనే.. సత్వరమే రెండు రాష్ట్రాల ఏర్పాటుకు, కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకూ ఎలాంటి చిక్కులూ ఉండవని కేంద్రం భావిస్తున్నట్లు సవూచారం. ఇప్పుడు చేసిన ఏర్పాట్ల మేరకు రెండు రాష్ట్రాల్లోనూ విడివిడిగా షెడ్యూల్ మేరకే ఎన్నికలు నిర్వహించగలవుని ఎన్నికల కమిషన్ కూడా చెప్తున్నందున.. రెండు కొత్త ప్రభుత్వాల నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే తవుకు సానుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెప్తున్నారు.
Advertisement