జనతంత్రం
‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్’ సెటిల్ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్ బుక్’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్ బుక్’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత, ‘రెడ్ బుక్’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం.
ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.
అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.
వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్ కౌన్సిలర్‌నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు.
560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.
జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.
ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది.
రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్‌ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.
రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి.
నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.
‘ఎస్‌ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.
రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి.
భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!
రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్‌బుక్ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్‌రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్‌ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.
ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి.
అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్‌లో తమ ’సూపర్ సిక్స్’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్‌ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్ ఆన్ అకౌంట్’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment