సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతీసారి పోలీసు శాఖను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన తీరు పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆక్షేపించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. చంద్రబాబు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని డీజీపీకి, పోలీసు శాఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్‌ఖాన్, కోశాధికారి ఎం.సోమశేఖర్‌లు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే విషయం గత ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతినిజాయతీగా పనిచేసే అధికారిగా పేరుందని, అలాంటివ్యక్తిపై చంద్రబాబు విమర్శలు చేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అఖిల భారత సర్వీసు అధికారుల సేవల్ని ఉపయోగించుకుని ఇప్పుడిలా వేరు చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన డీజీపీకి ప్రాంతీయభేదం ఆపాదించి దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ చంద్రబాబు మాట్లాడటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని తప్పుపట్టారు. పోలీసు శాఖలో చంద్రబాబు చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, మాలో మాకు విద్వేషాలు సృష్టించి దాని ద్వారా లాభాన్ని ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని వారు ఆక్షేపించారు.
మీ భద్రతకోసం ఉన్న పోలీసులకు మంచినీళ్లూ ఇవ్వని ఘనత మీది..
మీ భద్రతకోసం విధుల్లో ఉన్న పోలీసులకు కనీసం మంచినీళ్లు ఇవ్వని ఘనత మీదని, మీకు పోలీసులను విమర్శించే నైతిక అర్హత లేదని వారు వ్యాఖ్యానించారు. పోలీస్ అధినేతనే టార్గెట్ చేసి విమర్శలు చేయడం ద్వారా యావత్తు పోలీసు వ్యవస్థను నిర్వీర్యంచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న చంద్రబాబు ఆలోచన రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఎక్కడ శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పదేపదే చెప్పే మీరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.
టీడీపీ మహిళా కార్యకర్త సినీనటి దివ్యవాణి మహిళలు సిగ్గుపడేలా పోలీసు శాఖపై చేసిన తీవ్ర పదజాలాన్ని చంద్రబాబు ఖండించకపోవడం బాధాకరమన్నారు. 34 ఏళ్లపాటు పోలీసు సర్వీసులో అవిరళ కృషి చేసిన డీజీపీ సవాంగ్‌పై దివ్యవాణి అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామని, ఆమె తక్షణం పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా పోలీసులపై కొందరు అరాచక శక్తులు చేస్తున్న వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment